పోచారం ఆధ్వర్యంలో..  వ్యవసాయరంగం అభివృద్ధి


– రైతు బంధు, రైతు బీమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి
– వివాదరహితుడుగా గుర్తింపు పొందిన వ్యక్తి
– అలాంటి వ్యక్తి స్పీకర్‌గా ఏకగ్రీవం కావటం మంచిపరిణామం
– తెలంగాణ సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : నాలుగున్నరేళ్ల కాలంలో వ్యవసాయశాఖ మంత్రిగా శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ రంగ అభివృద్ధి ఎంతో కృషి చేశారని, తద్వారా లక్ష్మీపుత్రుడుగా పేరుగడించాడని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సభలో కేసీఆర్‌ మాట్లాడారు. స్పీకర్‌ గా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందదాయకమైన విషయమన్నారు. స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సభాపతి ఎన్నికను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకోవడం హర్షణీయమన్నారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అనేక మెట్లు అధిగమిస్తూ ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం హయాంలో తెలంగాణలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందన్నారు. పోచారం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం చేసిన సమయాన్ని నేను మరిచిపోలేనని, పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మంచి పనులు జరిగాయన్నారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని కేసీఆర్‌ తెలిపారు. పోచారం కాలుమోపిన వేళావిశేషం బాగుందని, కాబట్టే వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రైతుబంధు పథకం లాంటి పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే ఆ ఘనత వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డిదే అని కేసీఆర్‌ తెలిపారు. పోచారం పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారని, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి 1977లో సింగిల్‌ విండో ఛైర్మన్‌ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని, బాన్సువాడ ఉప ఎన్నికలో అఖండమైన మెజార్టీతో గెలుపొందారన్నారు. అందుకే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి లక్ష్మీపుత్రడని మేము పిలుచుకుంటామని
కేసీఆర్‌ అన్నారు. పోచారం వ్యవసాయ యాంత్రీకరణ, అధునాతన వ్యవసాయ పద్దతులు ప్రవేశపెట్టారన్నారు. ఇటీవలే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నాతో స్వయంగా చెప్పారని, రైతు బంధు పథకాన్ని కాలియా అనే పేరుతో మా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నమని నవీన్‌ పట్నాయక్‌ చెప్పారని కేసీఆర్‌ తెలిపారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా అక్కడ ఈ కార్యక్రమాన్నిచేపట్టారని, మిగితా చాలా రాష్ట్రాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో గొప్ప సేవలు అందించిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డి రాజ్యాంగ అత్యున్నత స్థానంలో బాధ్యతలు స్వీకరించడం పట్ల పోచారం గ్రామస్థులు సంబురాలు చేసుకున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు.