పోరాటాల పరంపర ఇక ఉధృతం

– టీమంత్రులే లక్ష్యంగా భవిష్యత్‌ ఉద్యమం
– రాజకీయంగా ఒత్తిడి పెంచే దిశగా ప్రయత్నం
– తెలంగాణవాదులకు ఉత్తేజాన్నిచ్చిన ‘సాగర హారం’
– తెలంగాణ మార్చ్‌కు దీటుగా ఉద్యమ కార్యాచరణ
– సరికొత్త వ్యూహాలతో టీజేఏసీ సంసిద్ధం
– గాంధీ జయంతి సాక్షిగా దీక్షలతో కదం
– నేడు బాపూ ఘాట్‌ వద్ద నిరసన దీక్ష
– త్వరలోనే ఆమరణ దీక్షకు రణతంత్రం
– ఉద్యమంలో పెద్దన్న పాత్ర కోదండరాందే !
హైదరాబాద్‌, అక్టోబర్‌ 1, (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జేఏసీ, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ ప్రజలతో కలిసి పోరాటాల పరంపరను ఉధృతం చేయనుంది ! భవిష్యత్‌ ఉద్యమంలో తెలంగాణ మంత్రులే లక్ష్యమని జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలంగాణ మార్చ్‌ వేదికపై ప్రకటించిన విషయం తెలిసిందే. అదే బాటలో వారిపై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది. తెలంగాణ మార్చ్‌లో భాగంగా నెక్లెస్‌ రోడ్డుపై నిర్వహించిన సాగర హారం తెలంగాణవాదులకు మరింత ఉత్తేజాన్నిచ్చింది. దీంతో తెలంగాణ జేఏసీ కూడా తెలంగాణ మార్చ్‌కు దీటుగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నది. సరికొత్త వ్యూహాల తో ఇప్పటికే సంసిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే నేడు అంటే మంగళవారం గాంధీ జయంతి సాక్షిగా ముందుగా దీక్షలతో నిరసన తెలుపాలని జేఏసీ నిర్ణయించింది. నేడు బాపూఘాట్‌ దగ్గర జేఏసీ ముఖ్య నాయకులు నిరాహార దీక్ష చేయనున్నారు. అంతేగాక, త్వరలోనే జేఏసీ చైర్మన్‌ కోదండరాం నాయకత్వంలోనే ఆమరణ దీక్షను చేపట్టను న్నారు. ఇదే విషయాన్ని కోదండరాం తెలంగాణ మార్చ్‌ ముగింపు విషయాన్ని ప్రకటిస్తూ వెల్లడించారు. ఈ రకంగా చూస్తే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలే పెద్దన్న పాత్రలను పోషించాయి. కానీ, అవి తమ అవసరాలకు ఉద్యమాన్ని తాకట్టు పెట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ పాత్రను కోదండరాం పోషించనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే, ఇక ముందు తెలంగాణ మంత్రులే లక్ష్యంగా, ప్రభుత్వాలను ఇరుకున పెట్టేలా, చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా పోరాటం సాగనుంది. తెలంగాణ మార్చ్‌తోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెమటలు పట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం వాతావరణం అనుకూలిస్తే మార్చ్‌ తీవ్రత ఇంకా ఉధృతంగా ఉండేది. కానీ, పాలకుల అదృష్టం బాగుండి మార్చ్‌ను విరమించాల్సి వచ్చిందని ఇప్పటికే తెలంగాణవాదులు భావిస్తున్నారు. ఈసారి దీక్షలతో దిగి వచ్చేలా చేయాలని వ్యూహం రచిస్తున్నారు. వీటికి కూడా కేంద్రం దిగి రాకుంటే, ఉద్యమ కార్యాచరణ ఇంకా బలంగా ఉంటుంది. తెలంగాణ మార్చ్‌ను మించిన ఉద్యమం భవిష్యత్‌లో భారత పాలకులు చూడనున్నారని తెలంగాణవాదులు విశ్వసిస్తున్నారు. టీజేఏసీ కూడా ఆ దిశగానే కార్యాచరణ రూపొందిస్తోంది. ఇదంతా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.