పోరు ఆగదు

3

– 25న ఛలో హెచ్‌సీయూ

హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి):  దళిత పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో తాము చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసినంతమాత్రాన తమ ఉద్యమం ఆగబోదని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. మరో ఏడుగురు విద్యార్థులతో మరోసారి ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. హెచ్‌సీయూ ప్రాంగణంలో విద్యార్థుల దీక్షను భగ్నం చేసి.. వారిని ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలో విద్యార్థి జేఏసీ నేతలు శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడింది. రోహిత్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ, తమ డిమాండ్లన్నీ నెరవేరేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని హెచ్‌సీయూ జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 25న ‘ఛలో హెచ్‌సీయూ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని అన్ని వర్సిటీల నుంచి విద్యార్థుల తరలిరావాలని కోరారు.కాగా  విద్యార్థుల మధ్య ఏర్పడిన సమస్యలలోకి కేంద్ర మంత్రులు కలుగజేసుకుని విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు కారణమయ్యారని వామపక్షపార్టీలు, విద్యార్థి, దళిత, ఉపాద్యాయ, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు.  హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి రోహిత్‌ మృతికి బాధ్యులైన కేంద్రమంత్రులపై హత్యనేరం కేసు నమోదు చేయాలని  డిమాండ్‌ చేశారు.  విద్యార్థికి మృతికి కారణమైన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరాని, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, వీసీ అప్పారావు హత్యానేరం కింద కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలో పనిచేస్తున్నారన్నారు. రోహిత్‌ కుటుంబాన్ని ఆదుకోవాడానికి రూ.50లక్షల పరిహారం అందించాలన్నారు. విద్యార్థి మృతికి కారకులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కాగా హెచ్‌ సీయూ విద్యార్థి రోహిత్‌ మృతికి కారణమైనవారిని శిక్షించాలంటూ హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. రోహిత్‌ సంఘీభావ  పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టారు.. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, విశ్వేశ్వరరావు, ఇతర ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.. తమ్మినేనితో పాటు పలువురు నేతలు దీక్షలో కూర్చున్నారు.. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు..  ఇదిలా వుండగా  దళిత విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ విమర్శించింది. ఈ విషయమై ఆప్‌ నేత అశుతోష్‌ శనివారం విలేకరులతో మాట్లాడారు. ఘటన జరిగినఅనంతరం ఐదు రోజుల వరకు మోదీ ఈ విషయమై ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. స్పందించేందుకు ఆయనకు ఇన్ని రోజులు సమయం పట్టిందా.. అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయలు ఈ ఘటన తీవ్రతను తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.