పోరు ఆగదు

5

– వచ్చే నెల 1 నుంచి ధర్నాలు, బందులు

– హెచ్‌సీయూ జాక్‌

విజయవాడ(గాంధీనగర్‌),జనవరి28(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్‌ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఉద్యమబాట పట్టనుంది. ఫిబ్రవరి ఒకటిన అన్ని జిల్లా కేంద్రాల్లో రాస్తారొకోలు, 2న ధర్నాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని, 3న విద్యాసంస్థల బంద్‌ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి.రాజీవ్త్రన్‌, ఎ.రవిచంద్ర మాట్లాడుతూ రోహిత్‌ మరణానికి కారకులైన కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, దత్తాత్రేయలను క్యాబినెట్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నా కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మాత్రమే చేసి రోహిత్‌ విషయాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెచ్చరిల్లుతోందని, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌ శక్తుల దాడులు పెరిగాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. దాడులను అరికట్టి అన్నివర్గాల విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీని రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రోహిత్‌ మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. రోహిత్‌ తమ్ముడికి పర్మినెంట్‌ ఉద్యోగంతోపాటు ఆ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఐ.బయ్యన్న (ఏఐఎస్‌ఎఫ్‌), డి. నారాయణరెడ్డి (వైఎస్సార్‌ స్టూడెంట్‌ యూనియన్‌), కరీముద్దీన్‌ (స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌) పాల్గొన్నారు.కాగా హెచ్‌సియూలో ఆందోళన ఇంకా కొనసాగుతునే ఉంది.పరిశోధక విద్యార్థి వి.రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు గురువారం క్లాసులు నిర్వహించేందుకు ప్రయత్నించగా దానిని అడ్డుకున్నారు. క్లాసులకు తాళాలు వేసి బైఠాయించారు. బుధవారం తాత్కాలిక  విసిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గురువారం పాఠాలు చెప్పడానికి వచ్చిన  ప్రొఫెసర్ల ప్రయత్నాన్ని విద్యార్థి జేఏసీ అడ్డుకుంది. ఆ క్రమంలో ప్రొఫెసర్లతో విద్యార్థి జేఏసీ వాగ్వివాదానికి దిగింది. క్లాసులు నిర్వహించాలని విద్యార్థులు కూడా పట్టుబట్టారు. దీంతో విద్యార్థులతో విద్యార్థి జేఏసీ నాయకులు ఘర్షణకు దిగారు. రోహిత్‌కు న్యాయం జరిగే వరకు తరగతులు వద్దంటూ విద్యార్థి జేఏసీ నాయకులు తరగతి గదులకు తాళాలు వేసి… అక్కడే బైఠాయించారు.