పోరు ఆగదు

 

 

 

`గమ్యం ముద్దాడేవరకు…
` ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగిస్తాం
` సరిహద్దును ఖాళీ చేయం
` రాకేష్‌ టికాయిత్‌
దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): వ్యవసాయ చట్టాల రద్దుకు పార్లమెంటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ టికాయత్‌ స్పష్టం చేశారు. అప్పటి వరకు తాము ఢల్లీి సరిహద్దులను ఖాళీచేసేది లేదని కరాఖండిగా చెప్పారు. ముందుగా అనుకున్న విధంగా తమ ట్రాక్టర్ల ర్యాలీ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రధాని ప్రకటన ఎన్నికల గిమ్మిక్కేనని ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే వరకు ఆందోళన ఆగదన్నారు. ప్రధాని ప్రకటన వెలువడిన వెంటనే.. దిల్లీ శివారుల్లోని గాజీపుర్‌, టిక్రీ, సింఘు వద్ద నెలల తరబడి ఆందోళనలు చేపడుతున్న రైతులు సంబరాలు జరుపుకొన్నారు.కాగా చలిగాలులను, చండ్ర నిప్పులను లెక్క చేయకుండా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిలబడ్డారు. ఇంటిని వదిలి, కుటుంబ సభ్యులను విడిచి, ఎండకు ఎండి, వానకు తడిచి, గుడారాల్లో రహదారుల పక్కన తలదాచుకుంటూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారు. చివరకు కేంద్రం మెడలు వంచారు. ఈ పోరాటం వెనుక…వాలంటీర్లు, సామాజిక వంటశాలలు కూడా కీలక పాత్ర పోషించాయి.ఖాళీ కడుపులతో ఉద్యమం నడవదని రైతులకు తెలుసు. అందుకే సామాజిక వంటశాలలను ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరం పొడుగునా.. 24 గంటలూ వీటిని నడిపారు. సిక్కు వర్గానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు ఇందులో చురుగ్గా పాల్గొన్నాయి. సరిహద్దు సవిూప గ్రామాలు కూడా తమ వంతు సాయమందించాయి. గాజీపుర్‌ సరిహద్దు సవిూపంలోని బైన్స్‌వాల్‌ గ్రామం రోజూ రైతులకు ఉచితంగా పాలు సరఫరా చేసింది. ఇలా చాలా మంది ఆందోళనలో ఎక్కడా రైతుకు ఆకలి తెలియనివ్వలేదు. ఏడాదికిపైగా పోరాటంలో రైతులు ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. కరోనాతో పాటు.. దిల్లీలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులూ వారికి సవాళ్లు విసిరాయి. ‘‘మేం రైతులం. వర్షాలను, కరోనాను, శీతాకాలాన్ని.. ప్రకృతి విసిరిన ప్రతి సవాల్‌ను ఎదుర్కొని నిలిచాం’’ అని శుక్రవారం భారతీయ కిసాన్‌ సంఘటన్‌ ప్రతినిధి గురురావ్‌ యాదవ్‌ తెలిపారు. దేశాన్ని కరోనా రెండో దశ చుట్టుముట్టిన వేళ కూడా రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. శిబిరాలను విడిచి వెళ్లలేదు. కొవిడ్‌`19 జాగ్రత్తలు తీసుకుంటూనే పోరాటం కొనసాగించారు.