కార్మికుల గంగవరం పోర్టు ముట్టడి

‘పోర్టు బంద్‌ లో కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట

ఉద్రిక్తంగా పోర్టు పరిసరాలు
పోలీసులతో కార్మికుల ఘర్షణ
తోపులాటలో పలువురికి గాయాలు
జీతాల పెంపుకోసం ఆందోళన

విశాఖపట్నం  జనంసాక్షి :  విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్‌’ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.

తొలగించిన పోర్టు  కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు. బంద్‌ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు ప్రధాన ద్వారానికి 100 మీటర్ల దూరంలోని అదనపు గేటు వద్ద ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించారు.కార్మికులను అటువైపు రానీయ కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్మికుల ప్రతిఘటనతో పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పది మంది సిబ్బందికి తలకు గాయాలు అయ్యాయి. సీఐ కాలిలో ముళ్ల కంచెం దిగింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పలువురు కార్మికులను గ్రామస్థులను, పార్టీల నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తమ కడుపు కాలి ఆందోళన చేస్తుంటే తమ వారిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిత్యవసరాలు విపరీతంగా పెరిగిపోయాయని… ఇలాంటి పరిస్థితుల్లో పోర్టు వారు ఇచ్చే తొమ్మిది పదివేల జీతం ఎందుకూ సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. పిల్లల చదువులు, వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని అంటున్నారు. తమ గంగ తల్లిని లాక్కోవడమే కాకుండా తమ పొట్టలపై కొట్టారని అన్నారు కార్మికులు. అప్పట్లో చాలా చెప్పారని అవేవీ అమలు చేయడం లేదంటున్నారు. 45 రోజులుగా నిరసన దీక్షలు చేస్తుంటే పట్టించుకున్న వారే లేరని అంటున్నారు. అందుకే కడుపు మండి ఇప్పుడు గంగవరం ముట్టడికి వచ్చినట్టు చెబుతున్నారు. ఎన్ని రోజులైనా పోరాటం ఆపబోమంటున్నారు కార్మిక కుటుంబాలు, చావడానికైనా సిద్ధమని అంటున్నారు. తమకు అన్నం పెట్టే సముద్రాన్ని లాక్కున్న వ్యక్తులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎలా అప్పగించామో అలానే సముద్రం ఇచ్చేయమంటున్నారు. ఉద్యోగాలు కూడా తమకు వద్దని వేటకు వెళ్లి ప్టటెడన్నం తినే వాళ్లమని కానీ ఇప్పుడు ఆ పిడికెడు మెతుకులు కూడా నోటిలోకి వెళ్లడం లేదంటున్నారు.