పోలవరంపై నోరు పారేసుకోవడం తగదు

నిర్వాసితులకు తక్షణం పరిహారం చెల్లించాలి
మంత్రి పువ్వాడ కామెంట్లు అర్ధరహితం: నారాయణ


విజయవాడ,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వ్యాఖ్యలు అర్ధరహితమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పోలవరంతో ముంపు అంటూ చేసిన వ్యాఖల్లో ఎలాంటి పసలేదన్నారు. ఇది కావాలనే చేస్తున్న వ్యాఖ్యలని, రాజకీయ దురుద్దేశ్యంతో చేయడం తగదన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ వరద వస్తే విలీన మండలాల్లోకి నీళ్లు రాకుండా ఆపగలరా..? అని ప్రశ్నించారు. తెలంగాణ నేతలు విలీన మండలాలను తమకు ఇచ్చేయమంటే.. భద్రచలాన్ని ఏపీకి ఇచ్చేయాలని ఇక్కడి వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ ఇంకా ఎందుకివ్వడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్‌ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్యాకేజీ ఇస్తామని జగన్‌ హావిూ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి కటాఫ్‌ డేట్‌ పెట్టొద్దన్నారు. 2012లో చిన్నపిల్లలుగా ఉన్న వాళ్లు.. ఇప్పుడు పెద్ద వాళ్లయ్యారు.. పెళ్లిళ్లయ్యాయి. 2012లో పిల్లలుగా ఉన్నారు కాబట్టి.. వారికి పునరావాస ప్యాకేజీ ఇవ్వమంటే ఎలా?.. కానీ నాడు వైఎస్‌ ఇచ్చినంత కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. వరద బాధితులకు తెలంగాణలో రూ. 10 వేలు ఇస్తుంటే.. ఏపీలో రూ. 2 వేలు మాత్రమే ఇస్తున్నారని నారాయణ అన్నారు.