పోలవరం,ప్రత్యేక హోదాలపై మాటతప్పిన బాబు

ఆనాడే ఎందుకు రాజీనామాలు చేయలేదు
చంద్రబాబు చరిత్రహీనుడనే బుట్టదాఖలు చేశారు
ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శలు
ముందు టిడిపి ఎంపిలతో రాజీనామా చేయించాలన్న కొడాలి

 

విజయవాడ,జూలై29(జనంసాక్షి ):టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చరిత్ర హీనుడు అని… ప్రజలు చెత్త బుట్టలో పడేశారని వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆచరణాత్మకమైన ప్రణాళికతో పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌పై ప్రకటన చేశారని తెలిపారు. కేంద్రం నుండి నిధులు రావటం లేటైనా 41.5 అడుగుల వరకూ ఆర్‌ అండ్‌ ఆర్‌ తాను ఇస్తాను అని సీఎం చెప్పారన్నారు. 45.5 అడుగుల వరకూ పూర్తిగా నీటిని నింపాలంటే రెండేళ్ళు పడుతుందని… ఈలోపు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామన్నారని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తేనో, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇవ్వకుండా నీటిని నింపితేనో గగ్గోలు పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదిలావుంటే వైసిపికి చెందిన 23 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు రాజీనామాలు చేయాలో తమకు, జగన్‌కు తెలుసని.. చంద్రబాబు సలహాలు తమకు అవసరం లేదని అన్నారు.చంద్రబాబు ఉచిత సలహాలు మాని విూ పార్టీ ముగ్గురు ఎంపీలు, రాజ్యసభ సభ్యులచే రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. భారతదేశంలోని అత్యంత పిరికి నాయకుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేయించి వైసీపీ ద్వారా గెలిపించిన చరిత్ర జగన్‌ది అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేను కాదు కదా సమస్యపై సర్పంచ్‌ను కూడా రాజీనామాను చేయించని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలంటే పారిపోయే చంద్రబాబు తమకు సలహాలు ఇవ్వడం హాస్యస్పదమంటూ కొడాలి నాని యెద్దేవా చేశారు.