పోలవరం ఆలస్యం కావడంతోనే వరదలు
జగన్‌ది అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం
రెండోరోజూ పశ్చిమలో కొనసాగిన చంద్రబాబు పర్యటన
భీమవరం,జూలై22(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయి ఉంటే ఈ స్థాయిలో వరద వచ్చి ఉండేది కాదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో 2 వ రోజు పాలకొల్లు బ్రాడీపేట నుంచి ఆయన పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుద్దేశించి ఆవేశంగా మాట్లాడారు. 2020 మే కు పోలవరం పూర్తి చేసేలా అహర్నిశలు శ్రమించామని చెప్పారు. జగన్ అధికారం చేపట్టాక నిర్లక్ష్యం వహించారని, చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి, పూర్తి చేయక పోవడానికి చేతకాని తనమే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులకు కక్కుర్తి పడి డయాఫ్రం వాల్‌ను నాశనం చేశారని, దిగువ కాఫర్ డ్యాంను ముంచేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అజాగ్రత, నిర్లక్ష్యం వలన పోలవరం పూర్తికాలేదని కేంద్రమే చెప్పిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పర్యటనలో ఎంఎల్‌ఏ నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహన్ పాల్గొన్నారు.పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సొంపల్లి వద్ద జరిగిన పడవ ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉంటే, ఏమి జరిగి ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తోందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో ఆయన మాట్లాడుతూ… ప్రజలు చైతన్యవంతులు కాకపోయుంటే గ్రామాలన్నీ గోదావరిలో కలిసిపోయేవన్నారు. ఇది చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వ మని వ్యాఖ్యానించారు. విూరు బురదలో ఉంటే సీఎం జగన్ గాలిలో తిరుగుతున్నారని మండిపడ్డారు. కొంతమంది కళంకిత, అవినీతి అధికారులను జగన్ నమ్ముకున్నారన్నారు. దళిత నేత రాజేష్‌ను ఏవిధంగా వేధిస్తున్నారో అందరం చూస్తున్నామన్నారు. తాము అవినీతికి పాల్పడ్డామని జగన్ కల్లబొల్లి కబుర్లు చెప్పారని… అబద్దాలు ఆడారు.. నాటకాలు ఆడారు.. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు చాలా భయంకరంగా తయారయ్యారని అన్నారు.