పోలవరం డ్యామేజీపై నిపుణులతో విచారణ

సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌

అమరావతి,జూలై26(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ నిర్మించే చోట డయాఫ్రం వాల్‌కు మధ్య ఏర్పడ్డ పెద్ద గ్యాప్‌లు, నదీ గర్భం కోతకు గల కారణాలను వెలికితీసేందుకు నిపుణులతో విచారణ కమిటీని వేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు, పరస్పర ఆరోపణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఏర్పడ్డ గ్యాప్‌లకు ప్రకృతి వైపరీత్యాలు కారణం కాదని, మానవ తప్పిదమేనని హైదరాబాద్‌ ఐఐటి నిపుణులు తేల్చి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయని, దీనిపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నని పేర్కొన్నారు. ఈ విషయంపై నిపుణులతో విచారణ కమిటీని వేసి వాస్తవాలు వెల్లడిరచాలని, ప్రాజెక్టు పనుల్లో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.