పోలవరం బాధ్యత ఎప్పటికీ కేంద్రానిదే

చెప్పిన మేరకు నిధులు కేటయిస్తాం
పనులు సకాలంలో చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ వెల్లడి
ఏలూరు,మార్చి4(జనం సాక్షి ): పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపారు ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం నాడు ఏపీ సీఎం జగన్‌ తో కలిసి పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పోలవరం ప్రాజెక్టును సందర్శించానని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఏపీకి జీవనాడి అని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్ళను పరిశీలించానని, పనుల పురోగతిలో అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీకి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. తగిన సమయంలో పనులు పూర్తి అయ్యేలా సమావేశాల షెడ్యూల్‌ కూడా ఖరారు చేశామన్నారు. ముందుగా దేవీపట్నం మండలం ఇందుకూరు`1 నిర్వాసితుల కాలనీని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పరిశీలించారు. పోలవరం నిర్వాసితుల కోసం ఇక్కడ 350 ఇళ్లను నిర్మించారు. ఇందుకూరులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం నిర్వాసితులతో కేంద్రమంత్రి మాట్లాడారు. పునరావాస కాలనీ అద్భుతంగా ఉందని.. కాలనీలో ప్రభుత్వం చక్కని వసతులు కల్పించిందని ఆయన తెలిపారు. తాను కొన్ని పునరావాస కుటుంబాలను కూడా కలిశానని, పునరావాస బాధిత కుటుంబాల విషయంలో తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర అధికారులు, పీపీఏ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ప్రాజెక్టుకు సవరించిన అంచనాల విషయంలో రాష్ట్రం ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వటం లేదని? వివరాలు ఇచ్చిన తర్వాత నిధులను ఆమోదించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తాను రెండేళ్ల ముందే ఇక్కడకు రావాల్సిందని.. వచ్చి ఉంటే ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా జరిగి ఉండేవన్నారు. కరోనా కారణంగా రాలేకపోయానని.. దేశంలోనే ఎక్కువ రాష్టాల్ల్రో అధికారంలో ఉన్నామని అయినా ఇంకా చాలా పని చేయాల్సి ఉందని గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడిరచారు.