పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

5

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి 1(జనంసాక్షి):  నేటి జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం అంతా సిద్ధం చేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు ఈమేరకు అధికారులు తరలి వెల్లారని, ఇవిఎంలను బద్రత మధ్యతరలించామని తెలిపారు. సోమవారం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను తరలించామని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి వార్డుకు జోనల్‌ అధికారులను నియమించామన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఐదుగురు సిబ్బందితోపాటు అదనంగా మరొకరిని నియమిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోసం వెయ్యి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఓటు వేసేందుకు వచ్చేవారు తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. అది లేకుంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఇతర గుర్తింపు కార్డులు తీసుకురావాలని తెలిపారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు సెలవు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సెలవు దినంగా  ప్రభుత్వంప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా చూడాలని 3 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని సంస్థలు సెలవును పాటించాలని ఆదేశించారు.

ఓటును వినియోగించుకోవాలన్న నటులు

ప్రజాస్వామ్యంలో ప్రజల ఆయుధం ఓటు అని దీనిని  ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సిని నటులుపిలుపునిచ్చారు. మంగళవారం జరుగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుగు సినీ నటులు మహేశ్‌బాబు, రానా తదితరులు ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు వేసి హైదరాబాద్‌ ప్రగతిలో భాగస్వాములం అవుదాం అని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఓటు విలువను నిలబెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

పోలింగ్‌ సిబ్బంది ఆందోళన

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ నిర్వహించేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు తమకు సరైన సదుపాయాలు కల్పించడంలేదని ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని ప్రభుత్వ సిటీ కళాశాలలో ఉదయం 7గంటలకు రిపోర్టు చేశామని వారు తెలిపారు. తమకు కనీసం మధ్యాహ్న సమయానికి సరైన భోజనం అందించలేదన్నారు. పోలింగ్‌ విధుల కోసం వచ్చిన వారిలో బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులున్నారని వారికి సకాలంలో భోజనం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సౌకర్యాలు ఉన్నాయంటూ పంపి తీరా ఇక్కడికి వచ్చాక ఎలాంటి చర్య తీసుకోకపోవడం దారుణమన్నారు.