పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు
మూడంచెల సెక్యూరిటీ, సీసీ కెమెరాలతో నిఘా
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్
నగరంలో ఎన్నికల నిర్వహణపై సీపీ సందీప్ శాండిల్య
హైదరాబాద్,నవంబర్27(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉండటంతో పోలీసులు గ్రేటర్ హైదరాబాద్‌లోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 1,800కు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ రోజుకు 48 గంటల ముందు నుంచే తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. పోలింగ్ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలను అమర్చుతారు. వీటిని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో లింక్ చేయనున్నారు. ఇందుకు సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్,
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. డీసీపీ నుంచి లోకల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో మానిటరింగ్ చేస్తున్నారు. పోలింగ్ బందోబస్తుకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి 40 వేలకు పైగా మందితో కొనసాగిస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బందోబస్తుపై సిటీ సీపీ సందీప్ శాండిల్య సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్‌తో కలిసి ఆయన సవిూక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఈవీఎంలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో గొడవలు జరిగిన ప్రాంతాలను గుర్తించారు. ఓల్డ్ సిటీతో సహా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమస్యాత్మక కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్స్,సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్‌ను మోహరిస్తారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తారు. కేంద్రానికి100 విూటర్ల దూరంలో ఓటర్లను మినహా ఇతరులను అనుమతించరు. సిటీలో ఏడుగురు డీసీపీలు, 28 మంది ఏసీపీలు, 9 టాస్క్‌ఫోర్స్ టీమ్స్,9 స్పెషల్ ఫోర్సెస్,71 మంది ఇన్‌స్పెక్టర్లు,125 మంది ఎస్‌ఐలు పోలింగ్?బందోబస్తులో ఉంటారు.391 రూట్ మొబైల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో టీమ్‌లో కానిస్టేబుల్ సహా ఆయుధాలు కలిగిన మరో ముగ్గురు కానిస్టేబుల్స్ ఉంటారు. వీటితో పాటు 129 పెట్రోలింగ్ వెహికల్స్, 220 బ్లూ కోల్ట్స్,122 ఇతర వాహనాల్లో పోలీసులు తిరుగుతుంటారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహణపై ఇప్పటికే ఏరియా డీసీపీలకు దిశానిర్దేశం చేశామన్నారు.. ప్రతి పోలింగ్ సెంటర్‌లో మహిళా కానిస్టేబుల్‌ను తప్పనిసరిగా ఉంచుతున్నట్లు తెలిపారు. కమ్యూనికేషన్ కోసం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాం. గొడవలకు యత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిపి పిలుపునిచ్చారు.