పోస్టల్‌ మెయిల్‌ సర్వీసులను పునరుద్ధరించిన పాక్‌

కరాచీ, నవంబర్‌19(జనం సాక్షి) : జమ్మూ కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు తర్వాత భారత్‌ తో పోస్టల్‌ మెయిల్‌ సర్వీసులను నిలిపివేసి పాక్‌ తన నిరసనను వెలిబుచ్చింది. తాజాగా ఈ విషయంలో పాక్‌ యూ టర్న్‌ తీసుకుంది. పోస్టల్‌ మెయిల్‌ సర్వీసులను పునరుద్ధరించింది. ఉత్తరాల బట్వాడాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లు ప్రకటించింది. అయితే, పార్శిల్‌ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని తొలగించలేదని పేర్కొంది. కశ్మీర్‌ పై కేంద్రం తీసుకున్న చర్యలను నిరసిస్తూ.. పాక్‌ గత రెండు నెలలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న దౌత్య సంబంధాలను అలక్ష్యం చేస్తూ.. ఆగస్టులో పోస్టల్‌ మెయిల్‌ సర్వీసులను నిలిపివేసిన పాక్‌, అనంతరం, భారత విమానాలు తమ గగన తలం నుంచి ప్రయాణించకుండా పాక్షికంగా నిషేధించింది. దీంతో భారత్‌ పలు అంతర్జాతీయ వేదికలపై పాక్‌ అనుసరిస్తున్న వైఖరిని విమర్శించింది. తమదేశం పట్ల పాక్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనంటూ పేర్కొంది. ఫలితంగా పాక్‌ అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి తన నిర్ణయాలను క్రమంగా మార్చుకుంటోందని తెలుస్తోంది. భారత్‌తో పోస్టల్‌ సేవల పునరుద్ధరణ ఈ నేపథ్యంలో తొలి అడుగు అని విశ్లేషకులు అంటున్నారు.