ప్యారిస్ ఉగ్రవాదులపై పోలీసు ఆపరేషన్

ప్యారిస్ : ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరంలో చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి 12 మందిని కాల్చిచంపిన ఇద్దరు ఉగ్రవాద సోదరులను పోలీసులు వెంబడిస్తున్నారు. వాళ్లు ఓ కారులో వెళ్తుండగా పోలీసులు వెంబడించడంతో నిందితులైన సోదరులిద్దరూ ఓ గోడౌన్ ప్రాంతంలో దాక్కున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటపడటంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆపరేషన్ కొనసాగుతోందని.. ఉగ్రవాదుల చెంతకు పోలీసులు వెళ్లారని ఫ్రాన్సు హోంశాఖ మంత్రి తెలిపారు. ప్యారిస్ ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

డమార్టన్ ఎన్ గోయిల్ అనే ప్రాంతం వద్ద ఉదయం కాల్పులు జరగడంతో మళ్లీ ఏమయిందోనని స్థానికులు ఆందోళన చెందారు. అయితే.. కారును పోలీసులు వెంబడిస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. చివరకు ఎట్టకేలకు పోలీసులు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్లు ఓ గోడౌన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భారీ స్థాయిలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి.