ప్రగతి నివేదన సభకు భారీగా ప్రజల రాక
కాంగ్రెస్‌లో జిల్లాకు ఇద్దరుముగ్గరు సిఎం అభ్యర్థులు
గెలవలేని వారు కూడా సిఎం అభ్యర్థులే
కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల
విలేకర్ల సమావేశంలో డిప్యూటి సిఎం కడియం
వరంగల్,ఆగస్ట్31(జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీలో జిల్లాకు ఇద్దు ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, ఒకరినొకరు సమన్వయం చేసుకోలేని వారు అధికరాంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ కొంగర కలాన్ లో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు జాతీయ పార్టీలు సైతం నివ్వెర పోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పాతిక లక్షల మందికి పైగా ప్రజలతో నిర్వహించే భారీ బహిరంగ సభ భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుందన్నారు. వరంగల్ అర్బన్ హన్మకొండలోని సర్క్యూట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభతో కాంగ్రెస్ నివ్వెరపోవడం ఖాయమన్నారు. అలాగే వారి చెడ్డీలు, పంచెలు తడవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ తరవాత ఇంతటి సభ నిర్వహిస్తుందా అన్నది ఆలోచన చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమంతా నివ్వెరపోతోందన్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు నివేదించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారన్నారు. అయితే వాస్తవాలు మరచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు, చవాకులు వదులుతున్నారన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే అద్భుతంగా జరగనున్న నివేదన సభ పేరు వింటేనే ప్రతిపక్షాలు వణికిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా వంద సీట్లు వస్తాయని కేసీఆర్ చెబుతుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. తమకు మెజారిటీ వస్తుందని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ముందస్తు ఎన్నికలంటేనే భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, జానారెడ్డి ముందస్తు ఏంటని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటువేస్తే దోచుకోవడం, దాచుకోవడం, స్కాములు చేయడమే కాంగ్రెస్ పార్టీ పని అన్నారు. ప్రగతి నివేదన సభకు తరలుతున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ గత అక్రమాలు, అవినీతిపై ప్రశ్నించాలని, అదేక్రమంలో టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని కడియం సూచించారు. ఎన్నికలు డిసెంబర్‌లో వచ్చినా, మార్చిలో వచ్చినా, ఏప్రిల్ వచ్చినా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నుంచి మొదలుకొని పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలవలేని వారు కూడా ముఖ్యమంత్రులు తామంటే తామంటూ జిల్లాలో చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సొంత జిల్లా నేతలను కూడా సయోధ్య చేయలేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను గెలిపిస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అన్నిస్థానాలు టీఆర్‌ఎస్ పార్టీవేనని స్పష్టం చేశారు.
సభకు తరలించేందుకు రంగం సిద్దం
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రగతి నివేదన సభకు 2 లక్షల 50 వేల మందిని తరలించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కడియం శ్రీహరి చెప్పారు. ప్రజలను సభకు చేర్చడానికి 1250 ఆర్టీసీ బస్సులు, 1700 ప్రైవేట్ బస్సులు, 997 డీసీఎంలు, 1150 ట్రాక్టర్లు, తుఫాన్ లు, 4 వీలర్ వాహనాలు మొత్తంగా 3380 వాహనాలను సమకూర్చామన్నారు. ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేతలు దివాళాకోరు విమర్శలు చేస్తున్నారని కడియం మండిపడ్డారు. కాంగ్రెస్ లో ప్రతి జిల్లాకో ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. ఎల్లుండి ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకొని సభకు సహకరించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఎంపీలు పసునూరిదయాకర్, సీతారాం నాయక్, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.