ప్రగతి నివేదన సభ అంటేనే వణుకు

అభివృద్దిని విడమర్చేందుకే ఈ సభ

చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల,ఆగస్ట్‌31(ప్రగతి నివేదన సభ అంటేనే వణుకు): ప్రగతి నివేదన సభ దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని ధర్మపురి ఎమ్మెల్యే, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఈ సభ పేరు చెబితేనే ఇప్పుడు కాంగ్రెస్‌,బిజెపిలకు వణుకు పుడుతోందన్నారు. తెరాస ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి అన్ని వర్గాల ప్రజలు సభకు వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు. రైతులు ట్రాక్టర్లపై, కదలి రావడం ద్వారా కెసిఆర్‌కు అండగా ఉన్నామని చెప్పబోతున్నారని అన్నారు. సెప్టెంబర్‌ 2న కొంగరకాలన్‌లో జరిగే ప్రగతి నివేదన సభకు మండలం నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, విజయవంతం చేయాలని కొప్పుల పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృత ప్రచారం ద్వారా ప్రజకు మరోమారు విడమరచి చెబుతామని అన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి పథకాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయడానికే ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లడానికి పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నాని అమన్నారు. గ్రామాల వారిగా సభకు వచ్చే వారి జాబితాను సిద్ధం చేయాలని ఆయా గ్రామల నాయకులకు సూచించారు. ఇకపోతే వ్యవసాయం దండుగకాదు పండుగ అని నిరూపించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందనీ, రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశామని, తమది రైతుబంధు ప్రభుత్వమని ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. గతపాలకుల నిర్ల క్ష్యం కారణంగా వ్యవసాయం రంగం పూర్తిగా కుంటుబడిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అన్నదాతను ఆదుకొని అగ్రభాగానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో అభివృద్ధిలో దూసుకెళ్తూ బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేయగలిగామన్నారు. పెట్టుబడి సాయంతో అన్నదాతలకు అండగా ఉంటున్నామనీ, సబ్బండ వర్గాల అభివృద్ధే లక్ష్యం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎద్దేవా చేసినవారే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, నాలుగేళ్లుగా సాధించిన ప్రగతిని చూసి నివ్వెరపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ దేశంతోపాటు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను అందిస్తూ విమర్శలకు తగిన గుణపాఠం చెప్పినట్లయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్టు అన్నారు. కాళేశ్వరం పనులు ఈ దసరా వరకు పూర్తయ్యేలా పనులు వేగవంతంగా నడుస్తున్నాయన్నారు.