ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసుల మొహరింపు
బండిపై పోలీసుల తీరుకు నిరసనగా నిరసనలు
ఎక్కడికక్కడ బిజెపి నేతల అరెస్ట్..గృహనిర్బంధం
హైదరాబాద్,అక్టోబర్27(జనంసాక్షి): సిద్దిపేటలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసుల దాడిని నిరసిస్తూ బిజెపి ఆందోళనలకు దిగింది. దీంతో ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల దాడికి నిరసనగా మంగళవరాం చలో ప్రగతి భవన్‌కు ఎబివిపి, బిజేవైఎం పిలుపు నిచ్చిన నేపధ్యంలో వందల సంఖ్యలో ప్రగతి భవన్ పరిసరాల్లో పోలీసులు మోహరించారు. అలాగే తెలంగాణా భవన్ వద్ద కూడా పోలీసులు మొహరించారు. ఇక మరో పక్క కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష
కొనసాగుతోంది. కార్యాలయానికి తాళం వేసుకుని ఆయన నిర్బంధంలో ఉన్నారు. సిద్ధిపేట సీపీని సస్పెండ్ చేయాలంటూ సంజయ్ దీక్షకు దిగారు. సిద్దిపేటలో సోమవారం రాత్రి పోలీసుల తీరుకు నిరసనగా దీక్షకు సంజయ్ దిగారు. సిద్దిపేట ఘటనపై నిన్న అమిత్ షా ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళ నలకు పార్టీ శ్రేణులు ఆందోళనలకు సిద్దం అయ్యాయి. సంజయ్ దీక్షకు సంఘీభావం తెలపడానికి డి కె అరుణ, ఎంపీ సాయం బాబు రావు, బాబూ మోమన్ తదితరులు కరీంనగర్ వెళ్లారు. సంజయ్ దీక్ష పై ఆరా తీస్తున్న పోలీసులు దీక్ష కేంద్రం వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎంపి ధర్మపురి అర్వింద్, జితేందర్ రెడ్డి, వివేక్ తదితరులను గృహనిర్బంధం చేశారు. మెదక్‌లో బిజెపి కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు నిరసన చేస్తున్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించిన సీపీని సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. ఛలో ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ నేతలు పిలునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాజసింగ్, మోత్కుపల్లి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బయటకు వెళ్ళటానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
పోలీస్‌ల తీరుపై ఎంపి మండిపాటు
పోలీసుల తీరుపై బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు పోలీసులు మోహరించడంతో బయటకు వచ్చిన ఆయన పోలీసులపై మండిపడ్డారు. దీంతో వారు దూరంగా జరిగారు. ఈ సందర్భంగా ఎంపీ ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. తన ఇంటి ముందు పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా ఛలో ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు ఇవ్వడంతో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నామని చెప్పడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వలేదని అన్నారు. అసలు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నారా? ఫాంహౌస్‌లో ఉన్నారా? అని అరవింద్ ప్రశ్నించారు.
సిద్దిపేట ఘటన సిగ్గుచేటు
సిద్దిపేటలో పోలీసులు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటుగా ఉందని బీజేపీ నేత వివేక్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పోలీసుల్ని సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ కేడర్‌లా వాడుకుంటున్నారని ఆరోపించారు. దుబ్బాకలో గెలుస్తామనే నమ్మకం ఉంటే టీఆర్‌ఎస్ పోలీసులను ఎందుకు వాడుకుంటోంది? అని వివేక్ ప్రశ్నించారు. ‘సీఎం కేసీఆర్ పిరికి పంద.. అందుకే పోలీసులతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు. ఓడిపోతామనే భయంతోనే రఘునందన్‌ను కేసులో ఇరికించే యత్నిస్తున్నారు. దుబ్బాకలో కాళేశ్వరం కవిూషన్ల డబ్బుతో..ఓట్లు కొనాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు’ అని వివేక్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనలు చేపట్టిన విషయం విదితమే.