ప్రచారంలో అపూర్వ ప్రజాదరణ

ఎక్కడికెల్లినా ప్రజల బ్రహ్మరథం

కెసిఆర్‌ అబివృద్ది వల్లనే ఇదంతా సాధ్యం

నిర్మల్‌ రూరల్‌ గ్రామాల్లో మంత్రి ఇంద్రకరణ్‌ జోరుగా ప్రచారం

నిర్మల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు పరిచిన సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉహించని స్థాయిలో ప్రజా స్పందన లభిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ సారధ్యంలోని టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రజాదరణ కేవలం అభివృఆద్ది వల్లనే సాధ్యమయ్యిందని అన్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని తెలిపారు. నిర్మల్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నియోజకవర్గంలోని దిలావర్‌ పూర్‌ మండలంలోని సిర్గాపూర్‌, మాయపూర్‌, వడ్డేపల్లి, కంజర్‌, బన్సపల్లి, సాంఘ్వీ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంత్రికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 67 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్‌ సీఎంగా నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే చేసి చూపించడం జరిగిందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాములోనే గురుకులాలు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకయతీ, రైతుబీమా, రైతు బంధు, మండలం నుంచి గ్రామాలకు బీటీ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, 24 గంటల నిరంతర విద్యుత్‌ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా నిర్మల్‌ నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ది చెందిందన్నారు. 67 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌, టీడీపీలు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజాదరణ కలిగిన టీఆర్‌ఎస్‌ను చూసి ఓటమికి భయపడి కూటమిగా మన ముందుకు వస్తున్నారన్నారు. వారిని నమ్మితే నిలువునా మోసపోవడం ఖాయమన్నారు. నాడు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్‌, టీడీపీలు నేడు అధికారం కోసం కూటమిగా ఏర్పడ్డాయన్నారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధి విూ కళ్ల ముందు ఉందని.. అభివృద్ధిని చూసి ఓటేయాలని అల్లోల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు డా.మల్లికార్జున రెడ్డి, డా.సుభాష్‌ రావు, రాజ్‌ మహ్మద్‌, ఫణీందర్‌ రావు, విశ్వాస్‌ రెడ్డి, దేవెందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కోడే రాజేశ్వర్‌, మండలాధ్యక్షులు శ్రీనివాస్‌ రెడ్డితో పాటు అల్లోల జగదీశ్వర్‌ రెడ్డి, రమణ రెడ్డి, సింగాపూర్‌ తాజా మాజీ సర్పంచ్‌ సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.