ప్రచారంలో కోలాహలం


ఇంటింటికీ తిరుగుతూ ఉమ్మడిగా ప్రచారం
ఖమ్మం,మార్చి29(జ‌నంసాక్షి): ఖమ్మం,మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎక్కడ చూసినా గులాబీ కోలాహలం కనబడుతుంది. గడిచిన కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌
చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలంతా గులాబీ దండులా అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల మెజార్టీ స్థాయిలో గెలుపే లక్ష్యంగా ప్రచారానికి పదును పెంచుతూ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ప్రచారం ధూంధాంగా జరుగుతున్నది.నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో అభ్యర్థులంతా క్షేత్రస్థాయి పర్యటనలతో ముమ్మరం చేశారు. ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రచారంలో దిగారు.ఇంటింటికీ పాదయాత్రలో డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలు, బోనాలతో గల్లీలు, కాలనీల్లో ¬రెత్తిస్తున్నారు.  లోకసభ ఎన్నికల ప్రకటన ముందే పార్లమెంట్‌ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు నిర్వహించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో దూకుడు పెంచింది.మూడు పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొని అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలు, శ్రేణులకు దిశానిద్దేశం చేశారు. ఇందులో భాగంగానే గడిచిన కొన్ని రోజులుగా అభ్యర్థులు రోజంతా ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రచారాన్ని సాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు, రేపటి రోజున కేంద్రంలో టీఆర్‌ఎస్‌దే ముఖ్య పాత్ర పోషించబోతున్నదని ఓటర్లకు చెబుతూ వారిని ఆకట్టుకుంటున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తున్నది. కారు గుర్తుకే ఓటు వేస్తామంటూ అభ్యర్థులను అక్కున చేర్చుకుంటున్నారు. సంక్షేమ, అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని, చెబుతుండడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.