ప్రచారంలో జోరు పెంచిన దుర్గం చిన్నయ్య
కూటమి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు
మంచిర్యాల,నవంబర్2(జనంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కాసిపేట మండలం ధర్మారావు పేట, రేగులగూడా, లంబడి తండా, నాయకపు గూడా, కోమటిచెను గ్రామాల్లో తెరాస అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఇంటింటా ప్రచారం నిర్వహించారు. దుర్గం చిన్నయ్యకు పెద్ద ఎత్తున మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ తెరాసకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని దుర్గం చిన్నయ్య ఓటర్లను అభ్యర్థించారు. మహాకూటమి పేరుతో చంద్రబాబు నాయకుడితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు పన్నిన కుట్రను టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి దేశంలోని అన్ని రాష్ట్ర నాయకులు మెచ్చుకుంటే ప్రతిపక్షనాయకులకు మింగుడుపడక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 సంవత్సరాలు పోరాడి సాధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలందరికి తెలియజేయాలని సూచించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి దేశంలో నెంబర్ వన్ సీఎంగా గుర్తింపు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.