.ప్రజలకు ఉచిత వ్యాక్సిన్
– కేరళ సర్కారు నిర్ణయం
తిరువనంతపురం,డిసెంబరు 12 (జనంసాక్షి): కేరళ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ లభ్యత గురించే ఆలోచించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఈ వ్యాక్సిన్ కోసం ఛార్జీలు విధించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన రాష్ట్రాల్లో కేరళ మూడోది. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలకు హాజరు కాకపోవడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపైనా సీఎం విజయన్ స్పందించారు. ‘ప్రచారం అంటే ప్రజలను సవిూకరించడం. ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇది వాంఛనీయం కాదు. నేను సమావేశాలకు హాజరైతే పెద్ద ఎత్తున జనం గుమిగూడుతారు. నా ఎన్నికల ప్రచారం ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. నేనూ ప్రజలకు దూరం కాలేదు.. వారూ నన్ను దూరం చేసుకోలేదు’ అని వ్యాఖ్యానించారు.మరోవైపు, గడిచిన 24 గంటల్లో 59,690 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,949 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, మరో 5,268 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కేరళలో మొత్తంగా 6.64లక్షల మందికి కరోనా సోకగా.. వారిలో 6.01లక్షల మందికి పైగా కోలుకున్నారు. తాజాగా మరో 32 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,594కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 60,029 యాక్టివ్ కేసులు ఉన్నాయి.