ప్రజలకు సత్వర న్యాయం జరగాలి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల తిరుగుబాటుతో తలెత్తిన సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. సంధి కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లే ఉన్నా అంత త్వరగా సమసిపోవని తాజా విందు సమావేశంతో తేలింది. ఇరువర్గాల్లో అంతర్మధనం ప్రారంభమైంది. గతంలో జస్టిస్‌ కర్ణన్‌ లేవనెత్తిన అంశాలు కొంత కటువుగా ఉన్నా ఇంచుమించుగా ఇలాంటివే. కానీ ఆయనకు శిక్షవేసి జైలుకు పంపారు. తాజాగా నలుగురు న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు లేవనెత్తిన అంశాలు కూడా అన్యాయానికి సంబంధించినవే. మొత్తంగా సుప్రీం తుట్టెను కదపడంతో రేగిన వివాదం ఇప్పుడే తేలక పోవచ్చు. న్యాయమూర్తులు తమకు అన్యాయం జరగడం వల్ల వ్యవహారం బయటకు వచ్చింది. చీఫ్‌ జస్టిస్ట్‌ తమను ఖాతరు చేయడం లేదనో లేకపోతే బెంచీల ఏర్‌ఆపటులో పక్షపాత వైఖరితో వ్యవహరించారనో బాధతో మొత్తంగా సుప్రీం వ్యవహారం ప్రజలకు తెలిసింది. అయితే న్యాయమూర్తులు మరో విషయం తెలుసుకుంటే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా కేసులు తేలక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారు సత్వర న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రిమాండ్‌ ఖైదీలుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. కేవలం డబ్బున్న వారికే న్యాయం జరుగుతోందన్న అపవాదు ఉంది. అలాంటి సమస్యలు కోకొల్లలుగా సుప్రీం ముందు ఉన్నాయి. ఇలాంటి వాటిని, ఏళ్లతరబడి ఉన్న వాటిని గుర్తించి సత్వర న్యాయం జరిగేలా చూడాలి. అవసరమైతే ప్రత్యేక పనిగంటలు కేటాయించాలి. ఈ దేశ ప్రజలకు అత్యున్నత న్యాయస్థానం అండగా ఉందని, భారతదేశంలో సత్వర న్యాయం జరగగలదని నిరూపించాలి. కేవలం తమకు జరిగిన అన్యాయంతోనే ఈ నలుగురు న్యాయమూర్తులు సరిపెట్టుకోకుంటా ఈ సమస్యను ప్రజలకు ఉపయోగపడేలా ప్రతయ్నించాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇంతకాలం ఉద్యోగుల్లో లేదా సీనియర్‌ అధికారుల్లో ప్రమోషన్ల గొడవలు ఉంటాయని విన్‌ఆనం. కానీ సుప్రీంలో కూడా ఇలాంటి వ్యవహారాలు ఉంటాయని ఇప్పుడే దేశ ప్రజలు గుర్తించారు. ఇది కూడా ఓరకంగా మంచి పరిణామంగా చూడాలి.ఉన్నత న్యాయస్థానాలలో కొన్ని సందర్భాలలో తీర్పులు అనుకూలంగా రావాలంటే న్యాయమూర్తులకు అనుకూలురైన న్యాయవాదులను నియమించుకుంటే సరిపోతుందన్న అభిప్రాయం కూడా న్యాయవాద వర్గాలలో ఎప్పటి నుంచో ఉంది. న్యాయ వ్యవస్థలోకి సైతం అవినీతి ప్రవేశించిందని న్యాయమూర్తులే పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి న్యాయ వ్యవస్థ కూడా అవలక్షణాలకు అతీతం కాదని తేలిపోవడం లేదా? తాము సీనియర్లు అయినా అప్రధానమైన పోస్టింగులు ఇస్తున్నారని కార్యనిర్వాహక వ్యవస్థలో పనిచేసే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పలు సందర్భాలలో వాపోతుంటారు. కొంతమంది పోస్టింగులలో తమకు అన్యాయం జరుగుతోందంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది. ఇప్పుడు జస్టిస్‌ చలమేశ్వర్‌ నేతృత్వంలో నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అభ్యంతరం కూడా ఇటువంటిదే! సీనియర్లమైన తమ బెంచ్‌ల ముందు విచారణకు రావలసిన ముఖ్యమైన కేసులను తమ కంటే జూనియర్‌ న్యాయమూర్తుల బెంచ్‌లకు కేటాయిస్తున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ! దీనికి సమాధానం చెప్పవలసింది ప్రధాన న్యాయమూర్తి మాత్రమే! అయితే సుప్రీంకోర్టులో గానీ, హైకోర్టులలో గానీ న్యాయమూర్తులందరూ సమానమే!

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడు కావడంలో తనకు అన్యాయం జరుగుతున్నందుకు నిరసనగా

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేయాలని కూడా జస్టిస్‌ చలమేశ్వర్‌ ఒక దశలో ఆలోచించారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ సకాలంలో సుప్రీంకోర్టుకు రాకుండా అడ్డుపడింది కూడా అప్పుడు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న తెలుగువాడేనని చెబుతారు. తనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుపడ్డారన్న ఆవేదన జస్టిస్‌ చలమేశ్వర్‌లో ఇప్పటికీ ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయన్న భావన చాలాకాలంగా ఉంది. ఈ పెడధోరణి ఇప్పుడే మొదలు కాలేదు. తీర్పుల విషయంలో కూడా చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంతా సమానులే అయినప్పుడు సీనియర్‌, జూనియర్‌ అన్న తేడా ఎందుకుండాలి? అనుభవం ఉన్నవారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. ఏ కేసును ఏ బెంచ్‌కు కేటాయించాలన్నది ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తుంటారు. ఇక్కడే లొసుగులు చోటుచేసుకుంటాయని న్యాయవాద వర్గాలు అంటూ ఉంటాయి. ఫలానా న్యాయమూర్తి ముందుకు కేసు వస్తే చాలు? అనుకూలంగా తీర్పు వస్తుందన్న అభిప్రాయం కూడా కక్షిదారులలో ఉంది. మొత్తంవిూద విమర్శలు, ఆరోపణలకు అతీతం కాని దుస్థితికి న్యాయవ్యవస్థ చేరింది. ప్రజలు తమకు సత్వర న్యాయం కావాలని కోరుకుంటున్న వేళ అక్కడ ఉన్న లొసుగులు కళ్లకు సాక్షాత్కారం అవుతున్నాయి. న్యాయ వ్యవస్థ తీసుకునే నిర్ణయాలపై ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కో న్యాయమూర్తి ఒక్కో దృక్కోణంలో కేసులను పరిశీలించి తీర్పులు ఇస్తుంటారు. ఇటీవల ఇలా ప్రశ్నించిన కారణంగానే జస్టిస్‌ కర్ణన్‌ను శిక్షించినట్టు విస్తృత ధర్మాసనం అప్పట్లో పేర్కొంది. మరి తాజాగా విమర్శలు చేసిన ఈ నలుగురు విషయంలో కూడా అదే ధర్మం పాటిస్తారా అన్నది చూడాలి. కొలీజియం నిర్ణయాలు గానీ, ప్రధాన న్యాయమూర్తి వ్యవహారశైలి గానీ సరిగా లేని విషయం నిజమే అయితే జస్టిస్‌ కర్ణన్‌ విమర్శలలో కూడా వాస్తవం ఉండి ఉంటుంది. మొత్తంవిూద ఈ నలుగురు న్యాయమూర్తులూ న్యాయ వ్యవస్థలో సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఈ పరిణామం ఇకపై న్యాయ వ్యవస్థలో ఎలాంటి విపరీత పోకడలకు దారితీస్తుందో చూడాలి.