ప్రజలు ఆర్థికంగా చితికి పోతున్నారు

అయినా చలనం లేని కేంద్ర,రాష్టాల్రు
వామపక్ష ప్రజాతంత్ర శక్తులను బలోపేతం చేస్తాం
బిజెపికి వ్యతిరేకంగా కూటమిని నిర్మిస్తాం
బిజెపి ఓటమి ధ్యేయంగా సిపిఎం పనిచేస్తుంది
విూట్‌ది ప్రెస్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
విజయవాడ,ఫిబ్రవరి26(జనం సాక్షి): రాష్ట్రంలోని ప్రజా సమస్యల కోసం పనిచేయడంతోపాటు బిజెపికి వ్యతిరేకంగా కూటమిని బలోపేతం చేస్తామని, వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నిటినీ ఐక్యం చేసి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజల్లోకి తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యామ్నాయ లక్ష్యంగా కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతోందన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. వామపక్ష శక్తులంటే.. ప్రజల హక్కుల కోసం పోరాడే రైతాంగ, యువజన, దళిత, సామాజిక, మహిళా ఉద్యమాలని.. ఇవన్నీ కూడా వామపక్ష ప్రజాతంత్ర శక్తికి దోహదపడేవన్నారు. సమాజం లో అనేక రుగ్మతలున్నాయని, ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన చెందారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎంత పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నప్పటికీ మరోవైపు ప్రజలపై అదనపు భారాలు పడుతూనే ఉన్నాయని, విపరీతంగా ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రజలపై పన్నుల వసూళ్లు పెరిగిపోతున్నా యన్నారు. ఇలాంటి దారుణమైన స్థితి గతంలో ఎన్నడూ లేదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రజలపై అదనపు భారాన్ని పెంచుతుందన్నారు. యుద్ధం ఓ చోట మొదలయితే.. ఇక్కడ ధరలు పెరుగుతున్నా యన్నారు. మంచినూనె ధర పెరిగిందని, రేపు ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలయిపోతే పెట్రోల్‌ ధరలు మరింత పెరిగిపోతాయని అన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌ ధర పెరిగింది.. ఇంకా పెంచేస్తారని తెలిపారు. దేశంలో ప్రజా జీవనమే అతలాకుతలమయిన పరిస్థితి ఏర్పడిరదని చెప్పారు. ద్రవ్యోల్బం ఇప్పటికీ భరించలేని స్థాయికి చేరిందన్నారు. గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు నిత్య జీవితావసర వినియోగదారీ సూచి 6.7 శాతంగా ఉందన్నారు. పదేళ్ల క్రితం 4, 4.5 శాతంగా ఉన్న సూచి ఇప్పుడు 6 పాయింట్లకు చేరిందంటే ఎంత తీవ్రస్థాయికి చేరిందో తెలుసుకోవచ్చునన్నారు. మరోవైపు దేశంలో అభివృద్ధి కుచించుకుపోతుందని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. 45 సంవత్సరాల రికార్డులో నిరుద్యోగ సమస్య చేరిందన్నారు. యువత ఉద్యోగాలు లేక ఉపాధి హావిూ పనులకు పోతున్నారని తెలిపారు. ఈరోజు పెరుగుతున్న నిరుద్యోగం, ఓ ల్యాండ్‌మైన్‌లాగా.. ఎప్పుడైనా పేలచ్చుననే ల్యాండ్‌మైన్‌ లాగా.. ఉందని అన్నారు. 1975 జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమ సమయంలో ధరల పెరుగుదల` నిరుద్యోగం ఈ రెండు అంశాలే మొత్తం దేశ వ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఉద్యమానికి నాంది పలికాయని గుర్తు చేశారు. తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యి ప్రజాస్వామ్య ఉద్యమం రూపంలో అది ప్రజ్వరిల్లింద న్నారు. ప్రస్తుత పరిణామాలన్నీ సంక్షోభ దిశగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న సంక్షోభాల న్నిటినీ ప్రత్యామ్నాయం ఏంటి ? ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తగ్గిపోతే.. సామాన్యులపై భారాలను పెంచడమే ప్రత్యామ్నాయమా ? అని ప్రశ్నించారు. రాష్టాన్రికి రావల్సిన హక్కులు, నిధులు కేంద్రం నుండి రావడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం హక్కుల్ని తన చేతుల్లో పెట్టుకొని రాష్టాల్ర హక్కుల్ని మున్సిపాల్టీ స్థాయికి దిగజార్చి వనరులన్నిటినీ వాళ్ల చేతుల్లోకి తీసుకొని రాష్టాల్రకు రావల్సినవాటిని ఇవ్వడం లేదని వివరించారు. మన రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, పన్నుల సబ్‌ ఛార్జీలను కేంద్రం
తీసుకుంటుందని, జిఎస్‌టిలో వాటా ఇవ్వడం లేదని, రాష్ట్రం చీలిన తర్వాత పూడుస్తామన్న లోటు బ్జడెట్‌ని పూడ్చలేదని తెలిపారు. విభజన హావిూలు నెరవేర్చలేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో పునరావాసం కోసం రూ.38 వేల కోట్లు గిరిజనులకు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. గిరిజనుల జీవితాలు త్రిశంకు స్వర్గంలో ఉన్నాయని, 6 మండలాల ప్రజలందరినీ జలసమాధి చేయాలనుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. పునరావాసం లేకుండా ప్రాజెక్టును ఎలా కడతారని అడిగారు. సెంట్రల్‌ యూనివర్సిటీలకు నిధులివ్వడం లేదని, రాజధాని నిర్మాణం బాధ్యత నాదీ అన్న ప్రధాని ఇంతవరకు నిధులివ్వలేదని, రాజధాని ఏదో కూడా చెప్పలేదని అన్నారు. లక్ష కోట్ల గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటే.. బ్జడెట్‌లో ఆ లక్ష కోట్లను రుణం కింద ఇచ్చారని, ఏ కేంద్ర ప్రభుత్వం చేయని దుర్మార్గపు పద్ధతి మొదటిసారి జరిగిందని శ్రీనివాసరావు మండిపడ్డారు. గ్రాంట్లను అప్పుగా మార్చి.. ఆ అప్పులను తీసుకోవడానికి కూడా అవమానకరమైన షరతులు పెట్టిందని అన్నారు. విద్యుత్‌ సంస్కరణల మూలంగా కరెంట్‌ బిల్లులు పెరిగాయన్నారు. డిస్కాంలను ప్రయివేటుపరం చేసేస్తున్నారన్నారు. రైతులకు కూడా డిస్కాంలు పెడతామంటే.. అన్ని రాష్టాల్రూ వ్యతిరేకించాయి. కానీ ఒక్క ఎపి సిఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కేంద్రం ఏం చెప్పినా అమలుచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం రాష్ట్రంపై ఇంత ఒత్తిడి పెడుతుంటే.. దాన్ని ఎదిరించి నిధులు తెచ్చుకోవడమే ప్రత్యామ్నాయం అని సూచించారు. మొన్న బ్జడెట్‌ని చూస్తే.. సర్వం కార్పొరేట్‌ మయం అన్నట్లు ఉందని మరోసారి ఎద్దేవా చేశారు. రాష్ట్ర హక్కుల్ని సాధించడానికి కేంద్రంపై పోరాడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలూ బిజెపికి అనుకూలంగానే ఉన్నాయని అన్నారు. ప్రజలపై భారాలేయడం కాదు.. కార్పొరేట్ల నుండి లాక్కోండి.. అని సూచించారు. డిజిటల్‌ డేటాపై ఆధిపత్యం పెంచుతూ భారతదేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉన్మాద రాజకీయాలను ఓడిరచకపోతే దేశం అభివృద్ధి కాలేదని అన్నారు. దేశం ఐక్యంగా ఉంటే విదేశీ ఆధిపత్య శక్తులను కూడా ఎదుర్కోగలం అని చెప్పారు. ఈ దేశానికి బిజెపి నెంబర్‌ వన్‌ శత్రువు అని ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడిరచడమే ప్రధాన కర్తవ్యం అని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని నిశితంగా, నిర్మొహమాటంగా సమరశీలతతో పోరాడాలని కోరారు. సిపిఎం ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా బలాన్ని పెంచుకొని వామపక్ష శక్తుల్ని ఐక్యం చేసి ప్రత్యామ్నాయాన్ని తేవడానికి కృషి చేయాలని వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.