‘ప్రజలు ప్రశ్నిస్తారనే కేసీఆర్ అలా చేస్తున్నారు’ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు
జగిత్యాల: రాష్ట్రంలో భూప్రక్షాళన బాగా చేశారంటూ రెవెన్యూ సిబ్బందిని సీఎం కేసీఆర్ మెచ్చుకోలేదా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో భూప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల పరిశీలన సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులను అందలమెక్కించి వారికి నెల జీతం బోనస్‌గా కూడా ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం జీవన్‌రెడ్డి జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. లంచం లేనిదే పని జరగడంలేదని ఇప్పటికైనా సీఎం కేసీఆర్ గ్రహించినందుకు సంతోషమన్నారు. అవినీతి పెరగడానికి బాధ్యత పాలనా వ్యవస్థది కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంకా 25శాతం మంది రైతులకు పాసుపుస్తకాలు కూడా ఇవ్వలేదని, జారీ చేసిన వాటిల్లో కూడా చాలా తప్పులు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలు ప్రశ్నించే సమయం వచ్చిందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన తప్పును ఉద్యోగులపై నెడుతున్నారని విమర్శించారు. సీఎం పాలనా విధానం, ఆలోచనా విధానంలోనే మార్పు రావాలన్నారు. హౌసింగ్ విభాగం రద్దు చేయడంతో ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం జరగడం లేదని చెప్పారు. తమను లంచం తీసుకోమని కేటీఆర్ చెప్పారని సిరిసిల్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ అన్నారనీ.. వారిపై ఏం చర్యలు తీసుకున్నారని జీవన్ రెడ్డి నిలదీశారు. చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదని, రాజకీయ వ్యవస్థ ఆలోచనా విధానంలో మార్పు వస్తేనే అధికార యంత్రాంగం మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.