ప్రజల అవసరాల మేరకు పట్టణాలు అభివృద్ధి చేయాలి -రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ.

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 9(జనంసాక్షి)

ప్రజల అవసరాల మేరకు పట్టణాలు అభివృద్ధి చేయాలనీ రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (ఎం. ఏ.యు.డి.) సెక్రెటరీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి మహబూబాబాద్ మునిసిపల్ ప్రాంతంలో పర్యటించి శనగపురం పట్టణ ప్రకృతి వనం, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, క్రీడా ప్రాంగణం ను సందర్శించి పరిశీలించారు. ముందుగా శనగ పురం పట్టణ ప్రకృతి వనం ను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రకృతి వనాలను అభివృద్ధి చేసి ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి ను, అధికారులకు తెలిపారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణంను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి 4.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్లాన్ చూపెడుతూ, మొదటి బ్లాక్ లో 38 నాన్ వెజ్ షాపులు, రెండవ బ్లాక్ లో 37 షాపులు, మూడవ బ్లాక్ లో 37 పండ్ల, పూల వ్యాపారానికి స్బందించిన షాపుల కొరకు నిర్మాణాలు చేపడుతున్నట్లు, మునిసిపల్ పట్టణ ప్రాంతంలో చేపడుతున్న రోడ్డు వైడేనింగ్, పార్కులు, జంక్షన్ ల అభివృద్ధి, తదితర కార్యక్రమాలపై మార్కెట్ నిర్మాణం ప్రాంతంలో ఏర్పాటు చేసిన చాయ చిత్ర ప్రదర్శనను చూపెడుతూ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మునిసిపల్ కౌన్సిలర్ అజయ్ పట్టణంలో కొన్ని ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వబడలేదని తెలుపగా, కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, గతంలోనే ఏ ఏ ఇళ్లకు ఇంటి నంబర్ లు లేవో వివరాలు ఇవ్వాలని మునిసిపల్ అధికారులకు తెలుపడం జరిగిందని, ఇంటి నంబర్ లేని వాటి వివరాలు ఇస్తే వెంటనే పరిశీలించి సమస్య పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే వివరాలు ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి ప్రాంగణం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్ధన్, కౌన్సిలర్ మార్ణేని వెంకన్న, పి.హెచ్ ఈ.ఈ. రంజిత్, మునిసిపల్ డి. ఈ. ఉపెందర్, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు