ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాం – టీ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలనే తాము ప్రతిబింబించామని కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన బలంతోనే తాము అధిష్టానంపై ఒత్తిడి తెచ్చామని ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మందా జగన్నాథం, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివేక్‌, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. 2009 డిసెంబర్‌ 9 ప్రకటనకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఇంతకాలం కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం చెప్పాలని కోరిన పార్టీల అసలు రంగు కొన్ని రోజుల్లో బయట పడనుందని తెలిపారు. తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కో ప్రతినిధిని పంపి తమ స్టాండ్‌ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. తమను ఎన్నుకున్న ప్రజల పక్షానే ఎళ్లవేళలా ఉంటామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాజకీయాలు పెట్టి అఖిలపక్ష సమావేశాన్ని స్వాగతించాలని కోరారు.