ప్రజల ఇక్కట్లు చూడలేక సొంత ఖర్చుతో తాత్కాలిక మర్మతులకు శ్రీకారం

బయ్యారం,జులై29(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని వెంకట్రాంపురం నుండి జగ్నాతండా వెళ్లే రహదారి గురించి ప్రత్యేక కథనం వేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన వెంకట్రాంపురం సర్పంచ్ నీలమ్మారాము నాయక్, బాల్య తండా సర్పంచ్ సుధాకర్ మానవతా దృక్పథంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తమ సొంత ఖర్చుతో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాము నాయక్ మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా ఈ దారి అభివృద్ధికి నోచుకోలేదని, పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి, ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత్యంతరం లేక ఆడపడుచులు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతుంటే చూడలేక బాల్య తండా సర్పంచ్, వెంకట్రాంపురం సర్పంచ్ తోడ్పాటుతో తాత్కాలిక మరమ్మత్తులో భాగంగా వెంకట్రాంపురం నుండి జగ్నాతండా దారిని గుంతలను పూడ్చి,తిరిగి వర్షాలతో బురద ఏర్పడకుండా చిప్ సైజు కంకరను వేస్తున్నామని తెలిపారు. జిల్లా చైర్పర్సన్ సొంత ఇంటికి వచ్చి వెళ్లే రహదారి ఇలా గుంతలుగా ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదని,జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా చైర్ పర్సన్ తక్షణమే స్పందించి బీటీ రోడ్డు మంజూరు చేపించాలని డిమాండ్ చేశారు.బాల్య తండా సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ… దశాబ్దాల క్రితం నుండి అభివృద్ధికి నోచుకోని జగ్నాతండా రహదారి వల్ల వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితిలో వెంకట్రాంపురం సర్పంచ్ తాత్కాలిక మరమ్మత్తులో భాగంగా గుంతలను పూడ్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు.