ప్రజల ఐక్యతతో అభివృద్ధి సాధ్యం –

-రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

వివేకంతో విద్వేషాలను తిప్పికొడదాం

జాతీయ సమైక్యతను చాటేలా ఘనంగా జరిగిన వేడుకలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేసిన రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

పెద్దపల్లి, సెప్టెంబర్ – 17:

ప్రజలంతా ఐకమత్యంతో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు.

ముఖ్య అతిధి మాట్లాడుతూ, చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని, 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని అన్నారు. దీనిని పురస్కరించుకొని జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

భారతదేశం ఈ రోజు కన్పిస్తున్న పరిపాలన స్వరూపంలో మునుపు లేదని, స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు గాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం , మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావనలు, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైందన్నారు.

జాతీయ సమైక్యతా అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదని, ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యతని తెలిపారు. దేశం అనుసరిస్తున్న జీవనసూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తని తెలిపారు

75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించిందని, నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని పేర్కొన్నారు.

తెలంగాణలో సమస్త జనులు ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు చేస్తున్నాయని, ఈ దశలో మనందరం అప్రమత్తంగా కుట్రలను తిప్పి కొట్టాలని, వివేకంతో విద్వేషాన్ని ఓడించాలని, ప్రజల మధ్య ఐక్యతతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తూ, అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను తన ప్రసంగంలో ముఖ్య అతిథి వివరించారు.

అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకల్లో భాగంగా విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకున్నాయి. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం అనే పాట పై క్రేసింట్ హై స్కూల్ కు చెందిన విద్యార్థినులు, మహత్మ జ్యోతి బా పూలే రెసిడెన్షియల్ పాఠశాల పెద్దపల్లి విద్యార్థినులు , హే వతన్ గేయం పై జడ్పీహెచ్ఎస్ ధూళికట్ట విద్యార్థినులు, పాడుదమా స్వేచ్ఛా గీతం గేయం పై కేజీబీవి సుల్తానాబాద్ విద్యార్థినులు నృత్య ప్రదర్శనలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి,డీసిపీ రూపెష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్,మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ప్రజాప్రతినిధులు, అందరూ జిల్లా అధికారులు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.