ప్రజల దాహార్తి తీరుస్తాం.. కరువును తరిమేస్తాం
జలహారం పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
మహబూబ్‌నగర్,సెప్టెంబర్16(జనంసాక్షి): హావిూ ఇచ్చిన విధంగా వచ్చే మూడేళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ హావిూ ఇచ్చారు. ఈ మేరకు ప్రణాళికాబద్దంగా ముందుకు పోతున్నామని అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇంటింటికీ తులం బంగారం ఇవ్వడం కాదని.. సాగు, తాగునీరు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడటమేనని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాలలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీల నేతలపై విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుందే తప్ప… అభివృద్ధికి అడ్డుపడే ప్రతిపక్షాలకు కాదని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హావిూలను తప్పక నెరవేరుస్తామన్నారు. తమ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, టిడిపి నాయకులకు లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతోందని చంద్రబాబు అంటున్నారని… దీనిపై కేంద్రానికి లేఖలు రాస్తున్నారని విమర్శించారు. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కృష్ణా నదిలో 1200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు తెలంగాణకు హక్కు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నుంచి తెలంగాణకు 1200 టీఎంసీల నీరు రావాలి. తెలంగాణకు చట్టపరంగా రావాల్సిన నీటిని కూడా రానివ్వకుండా బాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణకు గోదావరి నుంచి 900 టీఎంసీలు, కృష్ణా నుంచి 300 టీఎంసీలు అధికారికంగా కేటాయించారు. ఇందులో 120 టీఎంసీలు తాగునీటికి వాడుకునే హక్కు తెలంగాణకు ఉంది. కానీ 120 టీఎంసీలలో 40 టీఎంసీలు మాత్రమే తాగునీటికి వాడుకుంటున్నాం. ఈ 40 టీఎంసీల నీటిని కూడా అడ్డుకునే ప్రయత్నం బాబు చేస్తున్నారని మండిపడ్డారు. అందరి కుట్రలను తిప్పికొడుతూ.. తెలంగాణను దేశంలోనే అత్యంత ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు. ప్రజలకు జవాబుదారీగా పని చేస్తామని, ప్రతిపక్షాలను విశ్వసించమని చెప్పారు. తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది దాహార్తిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే మూడేళ్లలో ఏ ఆడబిడ్డయినా మంచినీటి కోసం రోడ్డెక్కితే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఉద్ఘాటించారు. దీన్ని అదునుగా భావించిన చంద్రబాబు వాటర్‌గ్రిడ్ పథకాన్ని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి చంద్రబాబుకు కడుపు మంట వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు బాబు దొంగ నాటకాలడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు బాబు కేంద్రానికి లేఖల విూద లేఖలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని స్పష్టం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ ఆరోపణలు పట్టించుకోమని తేల్చిచెప్పారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను తప్పకుండా నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. వాటర్‌గ్రిడ్ పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండేళ్లలోనే పాలమూరు జిల్లాలోని ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామని తెలిపారు. పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్‌గ్రిడ్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. పాలమూరు వేదికగా వాటర్‌గ్రిడ్ పనులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఉద్ఘాటించారు. తెలంగాణలో పాలమూరు జిల్లా వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మంది వలసలు పోతుంటే గత పాలకులు ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో సీఎంలు ఈ జిల్లాను దత్తత తీసుకున్న జిల్లా రాత మారలేదన్నారు. ఎన్నికల ముందు మంత్రులు అరచేతిలో వైకుంఠం చూపించారని గుర్తు చేశారు. హావిూలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన దమ్మున్న సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరే అని తెలిపారు.
పాలమూరు ప్రజలకు మంచిరోజులు
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా ప్రజలకు మంచి రోజులు వచ్చినయి. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నరని పేర్కొన్నారు
సీఎం కేసీఆర్ ఓట్ల కోసం మాయమాటలు చెప్పే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పని చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను పట్టించుకోమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల మంత్రులు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు అని తెలిపారు.ప్రజల దాహార్తిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సమైక్య పాలనలో సాగునీరు లేక జిల్లా ప్రజలు వలసలు పోమరన్నారు. . సమైక్య పాలకులు బలవంతంగా నీటిని సీమాంధ్రకు తరలించుకుపోతున్నా మాట్లాడని నేతలు ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన పేర్కొన్నారు.