ప్రజల నడ్డివిరిచేలా భారాలు మోపడం తగదు
కేంద్రానికి వంత పాడుతున్న వైసిపి
ప్లీనరీలో ఎందుకు సమస్యలపై చర్చించరు
వైసిపి తీరుపై మండిపడ్డ సిపిఎం నేతలు
అమరావతి,జూలై9( జనంసాక్షి ):గత ఐదారు మాసాల్లోనే ప్రజలపై నడ్డివిరిచే భారాలు పడ్డాయి. కేంద్రం వడ్డించిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల భారాలకు…రాష్ట్ర ప్రభుత్వ భారాలు తోడై ప్రజలను మరింత కుంగదీస్తున్నాయి. కేంద్రం ఇష్టానుసారం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతున్నప్పటికీ వైఎస్సార్‌సిపి నుండి ప్రతిఘటన కూడా కానరావడంలేదని సిపిఎం మండిపడిరది. కేంద్రం పాపాల్ని కూడా తమ ఖాతాలోనే వేసుకుంటున్న తీరుకనిపిస్తోందని సిపిఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ సమస్యలపై ప్లీనరీలో ప్రకటించకపోవడం సరికాదన్నారు. వీటిపై కేంద్రంతో ఎలా ముందుకు వెళతారో చెప్పలేక పోయారని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్రం నుండి రావాల్సిన సహాయం
అందడంలేదు. నిర్వాసితులైన పేద ఆదివాసీలంతా అటూ అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి నోచుకోక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. 2021 డిసెంబర్ నాటికే పూర్తవుతుందనుకున్న పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని దుస్థితికి చేరుకున్నది. వైఎస్సార్‌సిపి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ప్రకటించడంతో అమరావతి అభివృద్ధి కుంటుపడిరది. గత ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని మాస్టర్ ప్లాన్‌తో ఒక తప్పు చేస్తే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్ధంగా అసలు రాజధానినే మార్చేసిందని అన్నారు. రాజధాని అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు ఇవ్వలేదు. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నమూ చేయలేదు. ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం దుర్మార్గంగా ప్రయివేటుపరం చేస్తుంటే నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గట్టి ప్రయత్నం జరగలేదు. కార్మికులు జీవన్మరణ పోరాటం చేస్తుంటే ఉత్తుత్తిగా తమ వ్యతిరేకతను ప్రకటించి కూర్చుంది. ఇప్పటికైనా వైఎస్సార్‌సిపి చొరవ తీసుకొని అన్ని పక్షాలను కలుపుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను నిలువరించాలి. తన చిత్త శుద్ధిని నిరూపించుకోవాలి. విభజన హావిూల్లో భాగంగా ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. కేంద్రీయ విద్యాలయాలకు నిధులూ రావడం లేదు. లోటు బ్జడెట్ పూడ్చుకోవడానికి రూ. 35 వేల కోట్లు బకాయిలు అలాగే ఉన్నాయి. జిఎస్టీలో మన వాటా ఇవ్వకుండా షరతులు పెట్టి అప్పులు తెచ్చుకోమంటే రాష్ట్ర ప్రభుత్వం తలూపింది. కేంద్రం ఇంత అన్యాయం చేస్తున్నా పల్లెత్తు మాట అనకపోవడం, నిధుల కోసం ప్రయత్నించకపోవడం, మన రాష్ట్ర హక్కుల్ని కేవలం కాగితాలకే పరిమితం చేయడం ఈ ప్లీనరీలో వైఎస్సార్‌సిపి ఏ విధంగా సమర్థించుకుంటుందో చూడాలి. కేంద్రం నుండి పోరాడి నిధులు రాబట్టుకోకపోగా ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నది. ఇవన్నీ చర్చించి ముందుకు వెళ్లాలని అన్నారు. ఆర్థిక సంక్షోభానికి తోడు రాష్ట్ర ఖజానా నింపుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం శాఖలవారీ పిండుతోందని అన్నారు. దుల్హన్ వంటి పథకాలను నిధులు లేక నిలిపివేసింది. అమ్మ ఒడికి కోతలు పెట్టింది. జగనన్న కాలనీలకు నిధులు లేక నత్తనడక నడుస్తున్నాయి. ప్రభుత్వ షరతులతో లబ్దిదారులు స్థలం వదులుకోలేక ఇళ్ళు కట్టుకోలేక సతమతమవుతున్నారని అన్నారు.
సులభతర వ్యాపారం పేరుతో బడా కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పీట వేస్తున్నది. రైతులు, కూలీలు, వృత్తిదారులు, వ్యాపారులు, ఆఖరికి చిన్న కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు కూడా భారాలను భరించలేక తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కౌలురైతులకు ఏ భరోసా లేదు. జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం కౌలురైతులకు శాపంగా మారిందన్నారు. ప్రతిపక్షంలో వుండగా పౌరహక్కుల గురించి గావుకేకలు పెట్టిన జగన్ నేడు వాటినే హరిస్తున్నారు. దళితులు, మహిళలపై అత్యాచారాలు, దాడులు దారుణంగా పెరిగాయి. కనీసం ప్రజలు చెప్పేది వినేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజల్ని కలుసుకోవడం, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడం ఏ కోశానా లేదు. ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించాలన్న కనీస ప్రజాస్వామ్య సూత్రానికి చెల్లు చీటీ ఇచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ షరతులకు తలొగ్గి వ్యవసాయ పంపుసెట్లకు విూటర్లు బిగించడం, విద్యుత్, బస్సు ఛార్జీలు పెంచడం, పట్టణాల్లో చెత్తపన్ను వేయడం, నూతన విద్యావిధానం పేరుతో పాఠశాలల విలీనం, స్కూళ్ళ ఎత్తివేత, ఇసుక, మద్యం మాఫియాలు వంటి అనేక సమస్యలు ప్రజల్ని పీడిస్తున్నాయని అన్నారు. ఈ ప్లీనరీ జరుగుతుండగానే రైతుల, తల్లిదండ్రుల ఆందోళనలు సాగుతున్నాయి. ప్రజల మనోభావాలను గుర్తించయినా ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుపై కేంద్రీకరించడం మంచిదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న బిజెపితో అంటకాగడం సరికాదన్నారు. నిధుల వేటలో ప్రజలపై అదనపు భారాలు మోపడం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై ప్రజల్లో
అసంతృప్తిని, వ్యతిరేకతను పెంచుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలే తమను గట్టెక్కిస్తాయన్న భ్రమలతో వైసిపి ఉందని కానీప్రజలు మంచీచెడు ఆలోచిస్తారని గుర్తించాలని సిపిఎం నేత అన్నారు