ప్రజల పక్షాన పోరు కొనసాగిస్తా

C

– ప్రేరేపిస్తే ప్రేరేపించబడేవాణ్ణి కాదు

– సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు విశ్రమించను

– విమర్శలపై స్పందించిన కోదండరాం

మంచిర్యాల,జూన్‌ 7(జనంసాక్షి): ఏది ఏమైనా, ఎవరేమన్నా  తెలంగాణ ప్రజలపక్షాన పోరు కొనసాగిస్తామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు.తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరాం మంగళవారం స్పందించారు. ఆయన ఏంమన్నారంటే ‘ఇప్పటికే ముప్పావు జీవితం గడిచిపోయింది. పావలా జీవితమే మిగిలి ఉంది. దాన్నీ తెలంగాణకే అంకితం చేస్తాను. ఎవరో ప్రేరేపిస్తే….ప్రేరేపించబడే వాడిని నేను కాను. తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదు’ అని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో రెండేళ్ల తెలంగాణ-ప్రజల ఆకాంక్షలు-ప్రభుత్వ పనితీరుపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కోదండరాం విలేకరులకు అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానమిచ్చారు. నేడు జరగబోయే జేఏసీ సమావేశంలో చర్చించుకుని ప్రభుత్వం తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెబుతానన్నారు. 30 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి, ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కూడా ప్రజల సమస్యలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ సాధించామో ఆ లక్ష్యం నెరవేరే దాక ప్రజల పక్షాన పోరాడుతామని కోదండరాం చెప్పారు.ఐకాస రాజకీయ సంస్థ కాదని… ప్రజలకు మేలు చేసే సంస్థ మాత్రమేనని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ‘ప్రజల ఆకాంక్షలు-ప్రభుత్వ తీరుతెన్నులు’ అనే సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు, తెరాస నేతలు తనపై చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఐకాసదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజల అభ్యున్నతి కోసమే ఐకాస పనిచేస్తుందన్నారు. ప్రజల అభివృద్దే ఐకాస కోరిక అని అన్నారు. తనకు ప్రజల ద్వారానే గుర్తింపు వచ్చిందని… అలాంటి ప్రజలను తాను విస్మరించబోనని స్పష్టం చేశారు. తమ వెనుక ప్రజలు తప్ప మరెవరూ లేరన్నారు. సింగరేణి ఉపరితల గనులకు వ్యతిరేకంగా కార్యాచరణ కొనసాగించనున్నట్లు కోదండరామ్‌ స్పష్టం చేశారు.ఎవరు ఏమన్నాసరే ప్రస్తుతం వ్యక్తిగతంగా మాట్లాడలేనని, కమిటీ సభ్యులు అందరం చర్చించిన తర్వాతే నిర్ణయం తెలియజేస్తామని ఆయన చెప్పారు. కార్యచరణకు సంబంధించి ప్రాధాన్యత అంశాలను గుర్తించామని దానికి తగినట్టుగా ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తున్నామని కోదండరాం తెలిపారు.