ప్రజల భాగస్వామ్యంతోనే .. విశ్వనగరం సాధ్యం
– అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
– నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర ప్రజలదే
– నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
– మూడు నెలల్లో 56 రిజర్వాయర్‌లను పూర్తిచేస్తాం
– మనిషికి 150 లీటర్ల తాగునీరు అందించడమే లక్ష్యం
– 40ఏళ్లు ఇబ్బందులు లేకుండా పైపులైన్లు ఏర్పాటు చేస్తాం
– వీధి కుక్కలు, దోమల సమస్యను నిర్మూలిస్తాం
– రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
– నిజాంపేటలో మన నగరం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
– స్థానికుల సమస్యలను తెలుసుకున్న కేటీఆర్
హైదరాబాద్, మే25(జనంసాక్షి) : భాగ్యనగరం విశ్వనగరం కావాలంటే ప్రభుత్వ ప్రయత్నంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రజల భాగస్వామ్యంతోనే హైదరాబాద్ విశ్వనగరంగా రూపొందడానికి ఆస్కారం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కూకట్‌పల్లి జోన్‌లోని నిజాంపేట కొలన్ రాఘవరెడ్డి హాల్‌లో మన నగరం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై ప్రసంగించారు. తొలుత స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్థానికులు దోమలు, వీధి కుక్కల బెడద, తాగునీటి సమస్య, రహదారుల అస్తవ్యస్తంపై మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు వాటి పరిష్కారానికి మంత్రి సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదల బస్తీల నుంచి అధునాతన కాలనీల వరకు అన్నింటా సమగ్ర అభివృద్ధి ఉండాలన్నారు. విశ్వనగరం కావాలంటే అన్ని మౌలిక వసతులు ఉండాలన్నారు. ఒక్కరోజులోనే విశ్వనగరం ఏర్పాటు సాధ్యం కాదన్నారు. నగరాన్ని తీర్చిదిద్దేందుకు ఏం చేయాలనేది అవగాహన కల్పనకు స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. మంచి ఆశయం సంప్రదాయంతో జీహెచ్‌ఎంసీ మంచి కార్యక్రమం చేపట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు. వీధి కుక్కలు, దోమల సమస్యను నిర్మూంచాల్సిన అవసరం ఉందని, 2వేల పైచిలుకు వీధి కుక్కలను నగరవాసులు దత్తత తీసుకున్నారని వెల్లడించారు. నగరంలో దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ చేపట్టే చర్యలతో పాటు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మంచినీరు సంతృప్తికర స్థాయిలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని తెలిపారు. ప్రతి మనిషికి 150 లీటర్ల మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నామని చెప్పారు. అసలు మంచినీరు లేని ప్రాంతాల్లో మొదట పనులు చేపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. రెండో విడతగా తక్కువ పరిమాణంలో నీరు ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటి లభ్యతను పెంపు చేస్తామని తెలిపారు. మూడో విడతగా పాత పైప్‌లైన్ల ఏరియాలను గుర్తించి వాటిని మార్చి కొత్త పైపులైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. శివారు మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తున్నామన్నారు. మంచినీటి విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామని కేటీఆర్ తెలిపారు. 3నెలల్లో 56 రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్న కేటీఆర్ రానున్న 40ఏళ్లు ఇబ్బంది లేకుండా పైప్‌లైన్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,
ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.