ప్రజల వద్దకు పంచాయితీరాజ్‌ శాఖ

2

వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జూన్‌3(జనంసాక్షి): గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేయడం ద్వారా వాటిని మరింతగా బలోపేతం చేయనునున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ వార్షిక నివేదికను బుధవారం మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సర్పంచ్‌ ఎన్నికల్లో గూడేలు, తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని అన్నారు. రహదారులు లేని పల్లె లేకుండా చేస్తామన్నారు. జవాబుదారీతనంతో కూడిన పాలన అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారాల బదలాయింపే కాకుండా బాధ్యతలు కూడా పంచుకోవాల్సి ఉంటుందన్నారు.  పల్లె సమగ్ర కేంద్రాలుగా ఈ – పంచాయతీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజల పన్నులతో ప్రభుత్వ పథకాలను బాధ్యతాయుతంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. ప్రజల సొమ్ముకు తాము ధర్మకర్తలము మాత్రమేనన్నారు. ప్రజలు కడుతున్న పన్నులను సక్రమంగా వినియోగించి ప్రజలకు మేలు జరిగేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మరుగు దొడ్లను నిర్మించి 2019 కల్లా బహిరంగ మల, మూత్ర విసర్జనలు లేకుండా తెలంగాణను తీర్చి దిద్దుతామన్నారు. ప్రతిపక్షాలు ఉనికి కోల్పోతామనే భయంతోనే వాటర్‌ గ్రిడ్‌ పై విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. కొత్త రోడ్ల నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ. 5,470 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. హరితహారం కింద రహదారులకు ఇరువైపులా 35 లక్షల మొక్కలను నాటుతామన్నారు.  150 మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. . గ్రావిూణ ప్రాంతాల్లో 67 శాతం పన్ను వసూలు చేయగా,2 వేలకు పైగా గ్రామాల్లో వందశాతం పన్ను వసూలు చేసినట్లు వెల్లడించారు.  ప్రజల నుంచి వసూలు చేసిన పన్నును పారదర్శకంగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.  ప్రజా పన్నులు-ప్రజా పనుల నినాదంతో అభివృద్ధి పనులు చేస్తున్నం. ప్రజలను భాగస్వామ్యం చేసేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించేందుకు ప్రణాళిక మేర కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎంతవరకు లక్ష్యం చేరుకున్నామో ప్రజలనే అడుగుతామన్నారు. పంచాయతీలకు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, పంచాయతీల పరిపుష్ఠం దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పంచాయితీ పన్నుల ద్వారానే ప్రభుత్వం నడుస్తోందని, అందువల్ల గ్రామాలను పటిష్టం చేయాల్సి ఉందన్నారు.