ప్రజాఉద్యమంలా హరితహారం

5

– 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

– వైభవంగా గోదావరి పుష్కరాలు

– భూ నిర్వాసిత కుటుంబానికో ఉద్యోగం

– సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: హరితహారం పథకం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఓ ప్రజా ఉద్యమంలా జరగాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో హరితహారంలో కూడా అలాగే పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో 230 కోట్ల మొక్కలను నాటాలని అన్నారు. ఇవాళ ఆయన ఎంసీహెచ్‌ఆర్‌డీ కేంద్రంలో అధికారులతో సవిూక్షలో ప్రసంగించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని పెంచి పెద్ద చేయడానికి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలను సంరక్షించడానికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాంగాణాల గేట్ల దగ్గర ఎనిమల్‌ ట్రాపర్‌లను పెట్టాలని సూచించారు. హరితహారంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ఇతర అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. పోస్టర్లు, కర పత్రాలు, ఆడియో, వీడియో పద్ధతులను ఉపయోగించాలని తెలిపారు. కవి సమ్మేళనాలు, అవధానాలు కూడా నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని, శ్రమదానం ద్వారా మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అన్ని రకాల ఉద్యోగులతోపాటు పోలీసులు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మిషన్‌ కాకతీయతోపాటు పలు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. హరితహారంలో కూడా పోలీసులు స్వయంగా పాల్గొని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. చెరువుల గట్ల దగ్గర సిల్వర్‌ ఓక్స్‌, ఈత చెట్లను పెంచాలని సూచించారు. నర్సరీల నుంచి మొక్కలను గ్రామాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ఉండే వీఆర్‌వోలతోపాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

పాఠశాలల హెడ్‌ మాస్టర్లు, తహశీల్దార్లు, వీఆర్‌వోలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత ఏడాదికి మొక్కలు నాటుతూనే వచ్చే ఏడాదికి అవసరమయ్యే మొక్కలను కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నశించిపోతోన్న అడవులను మళ్లీ దట్టమైన వనాలుగా తీర్చిదిద్దడానికి అనువైన మొక్కలు నాటాలని కోరారు.

గోదావరి పుష్కరాలను వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. పుష్కరాల సందర్భంగా దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో ఇతర జిల్లాల పోలీసులు విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పుష్కరాల్లో విధులు నిర్వర్తించే పోలీసులకు కడుపునిండా అన్నం పెట్టాలని… సిద్ధిపేట రైస్‌ మిల్లర్లు 10 వేల మందికి అన్నదానం చేసేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. పుష్కరాల్లో భద్రత నిమిత్తం సీసీ కెమెరాల ఏర్పాటు కోసం వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు. వర్షాల కారణంగా వాహనాలు దిగబడే ప్రమాదం ఉన్నందున.. వాటిని తీసేందుకు క్రేన్‌లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణ, అత్యవసర సేవల కోసం రెండు హెలికాప్టర్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు.భూనిర్వాసిత కుటుంబానికో ఉద్యోగం ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. భూసేకరణ బదులుగా భూమి కొనుగోలు జరపాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొని అంకిత భావంతో పనిచేయడం వల్లే పథకాలకు మంచి పేరు వస్తుందని తెలిపారు. జలహారం, నూతన పారిశ్రామిక విధానంకు మంచి ఆదరణ లభించిందని అన్నారు. తాను కేంద్ర మంత్రులు, నాయకులను కలిసినపుడు వారు మన పథకాలను మెచ్చుకున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పనుల ఆలస్యంను నివారించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. భూసేకరణ చేసేటపుడు భూనిర్వాసితులకు అనుకూలంగా విధానం ఉండాలని పేర్కొన్నారు. భూసేకరణ వివాదాలు తేలకుండా ప్రాజెక్టులు దశాబ్దాలపాటు ఆగిపోయాయన్నారు. భూమి కోల్పోయే వారితో చర్చలు జరిపి ప్యాకేజీ నిర్ణయించి, వెంటనే డబ్బులు చెల్లించాలని వివరించారు.