ప్రజాకోర్టులో తేల్చుకుంటా: ఆప్‌

న్యూఢిల్లీ,జనవరి22(జ‌నంసాక్షి): అనర్హత వేటును ఎదుర్కొనే విషయంలో న్యాయ పోరాటం చేయడంతో పాటు ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని 20 మంది శాసనసభ్యులకూ ఆప్‌ సూచించింది. అవసరమైతే సుప్రీంకోర్టుకూ వెళ్దామనీ, అనుకూలంగా తీర్పు రాకపోతే ప్రజాకోర్టుకు వెళ్లేందుకూ వెనకాడవద్దని వారితో నిర్వహించిన సమావేశం సందర్భంగా పేర్కొంది. లాభదాయక పదవులు కలిగి వున్నారన్న ఆరోపణలపై ఆమాద్మీ పార్టీకి చెందిన 20 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్‌ పంపిన సిఫార్సును రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఆదివారం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్నికల కమిషన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయం మేరకు ఢిల్లీ శాసనసభకు చెందిన 20 సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తు న్నట్లు రాష్ట్రపతి తన ఆదేశాలలో పేర్కొన్నట్లు ఈ నోటిఫికేషన్‌లో వివరించారు. అనర్హులైన వారిలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ సన్నిహితుడు, నజాఫ్‌గఢ్‌ ఎమ్మెల్యే, రవాణా మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌, చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే ఆదర్శ్‌ శాస్త్రి, లక్ష్మీనగర్‌ ఎమ్మెల్యే నితిన్‌ త్యాగి, పూర్వాంచల్‌కు చెందిన ప్రముఖ నేత సంజీవ్‌ ఝా తదితరుల పేర్లు ఈ జాబితాలోచోటు చేసుకున్నాయి. ఇదంతా కక్షసాధింపు చర్యగా ఆప్‌ సిఎం కేజ్రీవాల్‌ మండిపడ్డారు.తమ పార్టీకి చెందిన 20 మంది శాసనసభ్యులను శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ఆదివారం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి చేటు అని ఆఆమ్‌ ఆద్మీపార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్‌ చేసిన సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించిన విషయం తెలిసిందే. తమకు న్యాయవ్యవస్థపై విశ్వాసం వుందని, కోర్టు నుండి కొంతమేర సాంత్వన లభించవచ్చని భావిస్తున్నామని అనర్హత ఎమ్మెల్యేలు మదన్‌లాల్‌ చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులపై తీవ్రంగా స్పందించిన ఆప్‌ సీనియర్‌ నేత అశుతోష్‌ విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి చేటు అని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్‌ తీసుకున్న ‘బాధాకరమైన’ నిర్ణయంపె తుది నిర్ణయానికి వచ్చే ముందు తమ వాదనను వినిపించు కునేందుకు రాష్ట్రపతి అవకాశం ఇచ్చి వుంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసి నిర్ణయంపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో తమకు కొంత ఊరట లభించవచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇకపోతే ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ చేసిన సిపార్సును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిర్హేతుకంగా ఆమోదించారని సీనియర్‌ బిజెపి నేత యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు. ఆప్‌ ఎమ్మెల్యేలు 20 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయాన్ని వక్రీకరించడమేనన్నారు. విచారణ లేకుండా, హై కోర్టు ఉత్తర్వుల కోసం ఆగింది లేదని, రాష్ట్రపతివి నిర్హేతుకమైన ఉత్తర్వులు అని యశ్వంత్‌ ట్వీట్‌ చేశారు. ఎన్నికల కమిషన్‌ సిఫార్సులకు రాష్ట్రపతి కోవింద్‌ ఆమోదం తెలిపిన తరువాత కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆప్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ సెక్రటరీలుగా లాభదాయక పదవులలో కొనసాగుతున్నారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ శుక్రవారం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.