ప్రజారవాణా వాహనాల్లో.. జీపీఎస్‌ తప్పనిసరి

– ఏప్రిల్‌ 1లోగా ఏర్పాటు చేసుకోవాలని రవాణాశాఖ ఆదేశం
– గడువుపై ఎలాంటి పొడగింపులు లేవంటున్న అధికారులు
న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : ప్రజా రవాణా వాహనాలైనా బస్సులు, ట్యాక్సీల్లో జీపీఎస్‌ సిస్టమ్‌, పానిక్‌ బటన్‌(ఆపద విూట) తప్పనిసరిగా ఉండాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 1లోగా అన్ని ప్రజా రవాణా వాహనాల్లో వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ నిబంధనలను తీసుకురాగా.. కొన్ని రాష్టాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడంతో రవాణాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువులోగా పూర్తి చేయాలంటూ హెచ్చరించింది. ఏప్రిల్‌ 1, 2018 నుంచి అన్ని ప్రజా రవాణా వాహనాలు, ట్యాక్సీలు, బస్సుల్లో జీపీఎస్‌ పరికరాలు, పానిక్‌ బటన్‌  ఏర్పాటుచేయాలి’అని రవాణాశాఖ ట్వీట్‌ చేసింది. ఇది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన విషయం అని.. గడువుపై ఎలాంటి పొడగింపులు ఉండబోవని స్పష్టం చేసింది. వాహనాల్లో మహిళలపై దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. బస్సులు, ట్యాక్సీల్లో జీపీఎస్‌, పానిక్‌ బటన్‌ ఉంటే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని పేర్కొంది. అయితే మూడు చక్రాల వాహనాలు, ఈ-రిక్షాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించింది. జీపీఎస్‌, పానిక్‌ బటన్‌.. రవాణా శాఖ, పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించి ఉంటాయి. ఆపదలో ఉన్న ప్రయాణికులు పానిక్‌ బటన్‌ను నొక్కగానే విషయం పోలీసులకు, రవాణాశాఖకు చేరుతుంది. జీపీఎస్‌ ద్వారా ఆ వాహనం ఎక్కడుందో తెలుసుకుని ప్రయాణికులను రక్షించొచ్చు.