ప్రజావిశ్వాసం కోల్పోయిన పళని ప్రభుత్వం: స్టాలిన్‌

చెన్నై,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తమిళనాడులో పళనిస్వామికి బలం లేదని, ప్రజల విశ్వాసం కోల్పోయిందని డిఎంకె వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వం తోణం దిగిపోవాలని డిమాండ్‌ చేసింది. అసెంబ్లీలో ఏఐఏడీఎంకే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయేవరకూ డీఎంకే పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, త్వరలోనే వేరొక సర్కార్‌ కొలువుతీరుతుందని…ఒక్క క్షణంలోనే ప్రభుత్వం మారిపోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని 19 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ సీ.విద్యాసాగర్‌రావుకు లేఖలు ఇచ్చారని చెప్పారు. డీఎంకే తరపున తాము రాష్ట్రపతి, గవర్నర్‌లను కలిసి విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని కోరినా వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని స్టాలిన్‌ తెలిపారు. అసెంబ్లీలో సంఖ్యాబలం లేకున్నా పళని ప్రభుత్వం కొనసాగడం సరైంది కాదని అన్నారు. తాము మరోసారి గవర్నర్‌ను కలిసి అసెంబ్లీని తక్షణం సమావేశపరచాల్సిన ఆవశ్యకతను వివరిస్తామని చెప్పారు. మరికొంత కాలం తాము వేచిచూస్తామని, అయినా గవర్నర్‌ ఎలాంటి చర్యలూ చేపట్టకుంటే ప్రజలు, న్యాయస్ధానాల మద్దతుతో ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్టాన్రికి పలు రంగాల్లో అన్యాయం చేస్తున్న మోదీ సర్కార్‌ ముందు పళని ప్రభుత్వం మోకరిల్లుతోందని స్టాలిన్‌ ఆరోపించారు.