ప్రజావ్యతిరేక పాలనలో ఆరితేరిన జగన్
వెయ్యిరోజుల పాలనలో అక్రమాలు ఎన్నో
జగన్ వెయ్యిరోజుల పాలనపై టిడిపి బుక్‌లెట్
అమరావతి,మార్చి9(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యిరోజుల వైసీపీ పాలన తీరుపై టీడీపీ ఏపీ శాఖ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఈ వెయ్యిరోజుల్లో అధికార వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ తయారు చేసిన ప్రత్యేక బుక్‌లెట్‌ను ఏపీలోని టీడీపీ కార్యాలయంలో ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు
అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నక్కా ఆనంద్‌బాబు, ఏలూరి సాంబశివరావు, దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విూడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఏపీ సీఎం జగన్ ప్రజావ్యతిరేక పాలనకు శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు.
ప్రజావేదికను కూల్చడంతతో ప్రారంభైన ధ్వంస రచన కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలను తీసుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అమరావతిలో రాజధాని నిర్మించారని అన్నారు. ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చుకాకుండా రైతుల వద్ద నుంచి 34 వేల ఎకరాలు తీసుకుని ఈ నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. చంద్రబాబు నాయుడుకు పేరు, ప్రతిష్ట వస్తుందన్న ఆలోచనతో మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని వల్ల 139 బడా సంస్థలు తమ సంస్థలను నెలకొల్పేందుకు వచ్చారని, జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల తిరిగి వెనక్కి వెళ్లిపోయా యని వెల్లడిరచారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడులు ఎక్కడా జరుగలేదని ఏపీలో మాత్రం జరిగిందని అన్నారు. ప్రశ్నించేవారిపై దాడులు జగన్ ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు. రాష్ట్రంలో అనేక నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని ఇందులో వైఎస్ వివేకా హత్య ప్రధానమైందని విమర్శించారు. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్లు జగన్ వెయ్యి తప్పులు పూర్తయ్యాయని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. ప్రజలు ఇకనైనా కళ్లు తెరచి ఆలోచన చేయాలన్నారు. ఏపీ జనాభాలో 75శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్ మోసగించారని ఆరోపించారు. సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో అన్ని వర్గాలను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో కనీసం 3 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదన్నారు. ఏపీపీఎస్సీని జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కక్ష సాధింపు కోసమే జగన్ అధికారంలోకి వచ్చాడని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప అన్నారు. జగన్ దుర్మార్గంతో ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్టాల్రకు తరలిపోయాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేశాదరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు, కిడ్నాప్‌లు, బెదిరింపులతో స్థానిక ఎన్నికల్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. సొంత కంపెనీ సిమెంట్ ధరలు పెంచేందుకు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు.