ప్రజావ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతా..
` నా పోరాటం కొనసాగిస్తాం : ఎంపీ ప్రియాంక గాంధీ
వయనాడ్(జనంసాక్షి):కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వయనాడ్‌లోని మనంతవాడిలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని, ప్రసంగించారు.ప్రజలకు ఉన్న హక్కులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులపై తాము ఎంతో కాలంగా పోరాటం చేస్తుంటే..ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ప్రజల గురించి కాకుండా తమ స్నేహితుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆరోపించారు.వయనాడ్‌లో వరదలు సృష్టించిన విలయంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయినా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయాన్ని అందించట్లేదని మండిపడ్డారు. వయనాడ్ ఎంపీగా అక్కడి ప్రజల అవసరాలు, హక్కుల కోసం పార్లమెంట్‌లో తన గొంతుకను వినిపిస్తానని..వారి కోసం శక్తివంచన లేకుండా పని చేస్తానని అన్నారు. మన దేశంలో ఉన్న వ్యవస్థలను బలహీనం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర ఏజెన్సీలను ఎన్డీఏ ప్రభుత్వం పావులుగా వాడుకుంటూ..ప్రతిపక్షాలను భయపెట్టడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రియాంక, రాహుల్ గాంధీతో కలిసి శనివారం వయనాడ్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని తిరువంబాడిలోని ముక్కం, నికంబూర్‌లోని కౌలై, వండూరు, కొయ్‌కోడ్, మలప్పురం జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. నేడు మనంతవాడి ప్రాంత ప్రజలను కలిసి, వారి బాగోగులు తెలుసుకున్నారు.ఇటీవల వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఎంపీగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే వయనాడ్ స్థానం నుంచి భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ ఉప ఎన్నికలో తన సవిూప ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన (3.64 లక్షలు) మెజార్టీని ఆమె అధిగమించారు.