ప్రజాసమస్యలు పరిష్కరించలేక.. దేశాన్ని ఉన్మాదస్థితిలోకి నెట్టేస్తున్నారు

` మేధావులు కరదీపికలుగా మారి ఎదిరించాలి
` స్వతంత్ర భారత స్పూర్తి నేటి తరానికి తెలియాలి
` అందుకే వజ్రోత్సవాల నిర్వహణ
` ఎల్బీ స్టేడియంలో ముగింపు ఉత్సవాల్లో సిఎం కెసిఆర్‌
` పలువురు ప్రముఖలను సత్కరించి జ్ఞాపికలు అందచేత
(ఘనంగా ముగిసిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు
ఎల్బీ స్టేడియంలో జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌
ఆకట్టుకున్న వార్సి బ్రదర్స్‌ ఖవ్వాలి
ఉర్రూతలూగించిన శంకర్‌ మహదేవన్‌ గానం)
హైదరాబాద్‌(జనంసాక్షి):స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ.. పేదల ఆశలు నెరవేరలేదు.. అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదనే ఆవేదన మనకు కనబడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. వాటన్నింటిని విస్మరించి ఈ దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనమంతా చూస్తున్నామని అన్నారు. మౌనం వహించడం సరికాదని, అర్థమైన తర్వాత కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదన్నారు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. మన దేశంలో మన రాష్టాన్రిది ఒక ప్రత్యేకమైన స్థానం. స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకు, యువకులకు తెలియని వారికి విస్తృతంగా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టామని సీఎం తెలిపారు. అన్నింటిని మించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను చెప్పినట్లు విశ్వజనీనమైన సిద్దాంతాన్ని, అహింసా వాదాన్ని, ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించొచ్చని ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చిన మహ్మత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని అని అన్నారు. అటువంటి దేశంలో గాంధీ గురించి, ఆయన ఆచరణ గురించి, స్వాతంత్య పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈతరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రాణ, ఆస్తి త్యాగాలు, అమూల్యమైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చింది. స్వేచ్ఛా భారతంలో స్వేఛ్చా వాయువులు పీలుస్తున్నాం. 75 ఏండ్లుగా జరుగుతున్న విషయాలను మరోసారి సింహవలోకనం చేసుకోని ముందుకు పురోగమించా ల్సినటువంటి పద్ధతులను ఆలోచించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా.. స్వతంత్ర దేశంగా మార్చేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. వారందరికీ శిరసు వంచి వినమ్రపూర్వకంగా జోహార్లు ఆర్పిస్తున్నాను. ఘన నివాళులర్పిస్తున్నానని కేసీఆర్‌ పేర్కొన్నారు. పేదల ఆశలు నెరవేరడటం లేదు. అడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తుంది. అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదని ఆవేదన మనకు కనబడుతుందని కేసీఆర్‌ తెలిపారు. అద్భుతమైన ప్రకృతి సంపదతో, ఖనిజ సంపదతో యుశక్తితో, మానవసంపత్తితో ఉన్న ఈ దేశం పురోగమించడం లేదు. స్వాతంత్య ఉద్యమ స్ఫూర్తితో ఉజ్వలమైన రీతిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉంది. ఈ క్రమంలోనే ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించుకున్నాం. గ్రామాల్లో, పట్టణాల్లో స్వతంత్ర ఉద్యమంపై చర్చ జరిగిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపన చేయాలంటే సుమారు కోటి మంది పాల్గొన్నారు. ఏకకాలంలో ఆలపించడం తెలంగాణ రాష్టాన్రికి గర్వకారణం అని సీఎం పేర్కొన్నారు. మహాత్ముడు విశ్వమానవుడు. కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన గొప్పతనాన్ని యూఎన్‌వో ప్రశంసించింది. అంతర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే యూ ఆర్‌ గ్రేట్‌ అని పొగడ్తల వర్షం కురిపిస్తుంటూరు. గాంధీ గారి జీవిత విశేషాలు, విగ్రహాలు.. విదేశాల్లో ఉన్నాయంటే భారతదేశానికి గర్వకారణం అని చెప్పారు. గాంధీ సినిమాను 22 లక్షల మంది పిల్లలు చూశారంటే 10 శాతం మందికి స్ఫూర్తి కలిగిన కూడా ఈ దేశం బాగా పురోగమించడానికి వారి శక్తిసామర్థ్యాలు వినియోగిస్తున్నారని నమ్ముతున్నాను. ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొనసాగాలి. గాంధీ మార్గంలో దేశం పురోగమించాలి. అహింసా సిద్దాంతాన్ని ఉపయోగించుకొని తెలంగాణ సాధించాం. ఏ విధంగా పురోగమిస్తున్నామో మనకు తెలుసు. చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ, అలరించిన కళాకారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు. ఉత్సవానలు ఘనంగా నిర్వహించిన కేశవరావు కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. తరవాత అయన పలువురిని సన్మానించి శాలువా కప్పి జ్ఞాపికలు అందచేశారు. కేశవరావు కమిటీ స్వాతంత్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ రకాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని కేసీఆర్‌ అభినందించారు. ఈ సందర్భంగా సురవరం ప్రతాప రెడ్డి వారసుడు సురవరం అనిల్‌ కుమార్‌ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు అజయ్‌ గౌతమ్‌, కొమరం భీం వారసుడు కుమరం సోనేరావు, కల్నల్‌ సంతోష్‌ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌, వనజీవి రామయ్య, రావెళ్ల వెంకట్రామారావు తనయుడు రావెళ్ల మాధవరావు, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆకుల శ్రీజ, బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌, సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ తదితరులను కేసీఆర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సిఎస్‌ సోమేశ్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, కెవి రమణాచారి, కేశవరావు, దేశిపతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ముగిసిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్‌బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్టేడియంలో మొదట మహాత్మా గాంధీకి సీఎం కెసిఆర్‌ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, జెండావందనం చేశారు. దేశానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారంతో వేడుకలు ముగియనుండగా.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముగింపు వేడుకలకు రాష్ట్రం నలమూలల నుంచి ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా వార్సి బ్రదర్స్‌ నిర్వహించిన ఖవాలి అందరిని మైమరిపించింది. వారి గానానికి అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. ఈ వేడుకలను సీఎం కేసీఆర్‌ తో పాటు పలువురు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. వార్సి బద్రర్స్‌ ప్రఖ్యాతమైన ఖవాలి కళాకారులు. 2014లో కేంద్ర సంగీత నాటక అకాడవిూ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆ ఉర్దూ సుగంధాన్ని పంచబోతున్నారు. ఇరానీ చాయ్‌లో బన్‌ మస్కతి అద్దుకొని తిన్నట్లు కవాలిని ఆస్వాదిద్దామని ప్రముఖ కవి, గాయకుడు, రచయిత దేశపతి శ్రీనివాస్‌ సభకు తెలియజేశారు. ఇకపోతే స్వరశిఖరం.. భారత బాలీవుడ్‌ సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ తన గానంతో తుపాను సృష్టించారు. ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో శంకర్‌ మహాదేవన్‌ తన గాత్రంతో అందర్నీ మైమరిపించారు. గణనాయ కాయ పాటతో తన కార్యక్రమాన్ని శంకర్‌ మహదేవన్‌ ప్రారంభించారు. ఎవరి పేరు చెబితే యావత్‌ భారతం సముద్ర తరంగమై ఉప్పొంగుతుందో.. ఎవరి పేరు చెబితే ఒక అద్భుతమైన గానం మన హృదయాల్లో ఆవహిస్తుందో.. ఎవరి పేరు చెబితే యువకులు ఆశ్వాల్లాగా పరుగెడుతారో.. అటువంటి ఓ స్వర మాంత్రికుడు, స్వరగిరి శిఖరం, ముంబై దగ్గరుండే చెంబూరులో జన్మించి, ఐదో ఏట నుంచే సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టాడు. ఆయన కర్ణాటక సంగీతంలో విద్వాంసులు. హిందుస్తానీ సంగీతంలో విద్వాంసులు. పాశ్చాత్య సంగీత కళలన్నీ అవపోసన పట్టాడు. 1988లో బ్రీత్‌లెస్‌ సాంగ్‌ పాడి ఓ కొత్త ఒరవడిని సృష్టించాడు. అది ఒక మహోన్నతమైనటువంటి సంగీత తుపానుగా భారతాన్ని చుట్టుముట్టింది. ఆయనే శంకర్‌ మహదేవన్‌ అంటూ దేశపతి శ్రీనివాస్‌ సభకు పరిచయం చేశారు. ఆయన గానంతో అందర్ని మైమరిపించారు. పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.

తాజావార్తలు