` కేసీఆర్ వందనోటు కాదు..దొంగనోటు
` చిరుమర్తిని గెలిపిస్తే దొరగడీకి చేరిండు
` కోమటిరెడ్డి బ్రదర్స్‌కు దోఖా ఇచ్చిండు
` నకిరేకల్ ప్రచార సభలో రేవంత్ విమర్శలు
` బీఆర్‌ఎస్,బీజేపీల కుమ్మక్కు రాజకీయాలు
` కాంగ్రెస్ నేతలపై ఐటి, ఈడీ దాడులకు కుట్ర
` తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
నల్లగొండ,హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు, హైదరాబాద్‌లో పది వేల ఎకరాలను సీఎం కేసీఆర్ దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారంరేవంత్ నకిరేకల్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘ఎలక్షన్స్… .కలెక్షన్స్… సెలక్షన్స్ పేరుతో కేసీఆర్ రాష్టాన్న్రి దోచుకున్నారు. నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్యను నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచి పార్టీ ఫిరాయించి దొర గడీకి చేరిండు. పార్టీ పిరాయించిన 12మందిని అసెంబ్లీ గేటు తాకనివ్వొద్దన్నారు. చిరుమర్తి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంతగానో పాటుపడి గెలిపించారని, అలాంటి వాడు కాంగ్రెస్‌కు దోఖా చేశాడని అన్నారు. కోమటిరెడ్డికి పేరు వస్తుందని ఎస్‌ఎల్బీసీని పక్కన పెట్టారు. కేసీఆర్ దొంగనోటు లాంటివాడు. నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా.. కేసీఆర్ దొంగనోటు లాంటివాడు. 30లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లో రోడ్లపై ఖాళీగా తిరుగుతున్నారు. వేముల వీరేశంను 40వేల మెజారిటీతో గెలిపించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్లు పాలించిన సిఎం కెసిఆర్ ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని, ఏళ్లుగా నిరుద్యోగులు హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు రావాలంటే నిరుద్యోగులే కార్యకర్తలు కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు తల్చుకుంటే కాంగ్రెస్‌కు 50 లక్షల మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పారు. సిఎం కెసిఆర్‌ను ఓడిస్తే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హావిూ ఇచ్చారు. ఉమ్మడి పాలన కంటే కెసిఆర్ పాలనలో అన్యాయం ఎక్కువ జరిగిందన్నారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ వంద నోటు కాదని దొంగ నోటు అని చురకలంటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా కూడా బిఆర్‌ఎస్ రాదన్నారు. నల్లగొండ గడ్డా కాంగ్రెస్ పార్టీ అడ్డా అని ఆయన ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడా చూసినా నల్లగొండ యువకులే కనిపిస్తారన్నారు. తాను, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం.. త్రిమూర్తులు మాదిరిగా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని ఎంపీ, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హావిూ ఇచ్చారు. అనాడు సోనియాగాంధీని ఎదురించి చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పిస్తే.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్, వేముల వీరేశంగా పోల్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా భరోసా సభలో ఎంపీ, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతించారని అన్నారు. అధికారంలోకి రాగానే కొత్త ఉద్యోగాలను సృష్టించి.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని హావిూ ఇచ్చారు. నకిరేకల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను ఎవరూ పట్టించుకోవద్దని చెప్పారు. నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కష్టపడి పని చేయాలని కోరారు. కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి అడ్డుపడ్డా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేరని చెప్పారు.
బీఆర్‌ఎస్,బీజేపీల కుమ్మక్కు రాజకీయాలు
హైదరాబాద్:బీజేపీ` బీఆర్‌ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను కూడా మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని విమర్శించారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు…ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా అని ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని… ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇది బీజేపీ ` బీఆర్‌ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అని అన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి అని అన్?రు. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుంచి అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన పదేళ్లలో మోడీ ` షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమ చిటుక్కుమన్నది లేదన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ తెలిపారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయన్నారు. అమిత్ షా ` కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం.. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం… ఇదే కదా జరుగుతున్నది అంటూ మండిపడ్డారు. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే… వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోందన్నారు. కేసీఆర్‌కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవన్నారు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్‌ను ప్రశ్నించవని.. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్‌ఆర్, తుమ్మల ఇళ్లపై తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు… కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా అంటూ విరుచుకుపడ్డారు. పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై కూడా ఉందన్నారు. ‘నేను బీజేపీ ? బీఆర్‌ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా. విూ పతనం మొదలైంది. విూ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. విూ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయి. వివేక్ వెంకట స్వామి కుటుంబంపై దాడి కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడిగా భావిస్తాం. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.