ప్రజాస్వామ్యానికి నిజంగానే బ్లాక్‌డే

నోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్‌

అహ్మాదాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): నోట్ల రద్దు, జీఎస్టీలను రూపొందించిన తీరు సరిగా లేదని, వాటిని తొందరపాటుగా అమలు చేశారని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరోమారు విమర్శించారు. నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ఆయన అహ్మాదాబాద్‌లో వ్యాపారవేత్తల సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు అనేది వ్యవస్థీకృత లూటీ అని ఆయన మళ్లీ గుర్తు చేశారు. మన ఆర్థిక వ్యవస్థకు, మన ప్రజాస్వామ్యానికి నోట్ల రద్దు అనేది బ్లాక్‌ డే అని మన్మోహన్‌ అన్నారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కేవలం చైనా మాత్రమే లాభపడిందని, ఎందుకంటే ఈ ఏడాది దిగుమతులు పెరిగాయని ఆయన విమర్శించారు. డిమానిటైజేషన్‌, జీఎస్టీ వల్ల సూరత్‌, వాపి, మోర్బీ ప్రాంతాల్లో పరిశ్రమలు దెబ్బతిన్నాయని, ఆ రెండు నిర్ణయాలు చిన్న వ్యాపారుల నడ్డి విరిచాయన్నారు. ముంబై నుంచి అహ్మాదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైల్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వంపై మన్మోహన్‌ విమర్శలు చేశారు. ఆ ప్రాజెక్టు ఓ వ్యర్థ ప్రయత్నమన్నారు. బుల్లెట్‌ రైళ్లను ప్రశ్నించినంత మాత్రాన అతను దేశ వ్యతిరేకి అవుతాడా, జీఎస్టీని, నోట్ల రద్దును ప్రశ్నిస్తే వాళ్లు పన్ను ఎగవేతదారులు అవుతారా అని మన్మోహన్‌ అన్నారు.