ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు
ఆదిలాబాద్, జూలై 26: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేసి వాటి పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్‌నాథ్ పేర్కొన్నారు. తెలంగాణ అంశం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష ఉప ఎన్నికల తెలియజేశారని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆగస్టు మాసంలో కృషి చేస్తామని అన్నారు. పార్టీ బలోపేతం చేసేందుకు తమ పార్టీ చేపట్టిన సభ్యత్వ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. ఆగస్టు మాసంలో పార్టీ గ్రామ, మండల కమిటీలు వేయనున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. రైతులు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాలకమండలిని వెంటనే నియమించాలని, దళిత, గిరిజన సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు దీక్షలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.