ప్రతిభ ఉన్నవారికి ఎప్పుడూ ఆహ్వానమే!
– భారత్, అమెరికా సత్సంబంధాలు ఇప్పటివి కావు
– హెచ్-1బీ వీసాలపై అమెరికా కాన్సులేట్ జనరల్ వ్యాఖ్య
ముంబయి, ఆగస్టు6(జనం సాక్షి ) : హెచ్-1బీ వీసాల జారీ విషయంలో ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అర్హులైన భారతీయులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని అమెరికా కాన్సులేట్ జనరల్ ఎడ్గర్డ్ కాగన్ పేర్కొన్నారు. దీనిపై ఎడ్గర్డ్ మాట్లాడుతూ… ‘భారత్‌తో సత్సంబంధాల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంటారని, అర్హులైన భారతీయులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుందన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఈనాటివి కావని, గత ఏడాది రికార్డు స్థాయిలో భారతీయులు అమెరికాకు వచ్చారని ఎడ్గర్డ్ కాగన్ అన్నారు. ఇరుదేశాల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అన్నారు. భారతీయులకు వీసా సేవలు అందించడం పట్ల చిత్తశుద్ధితో అమెరికా వ్యవహరిస్తోందన్నారు. అమెరికా విద్యార్థులు భారత్‌లో, ఇక్కడి విద్యార్థులు అక్కడ విద్యనభ్యసించడం సర్వసాధారణమైపోయిందన్నారు. దీన్ని దృఢపరుచుకోవాలంటే పరస్పర సహకారం అవసరమన్నారు. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి భారత్‌తో సత్సంబంధాలు పెంచుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్నీ ఆయన వదులుకోలేదని, ఇప్పుడు హెచ్-బీ వీసాల విషయంలోనూ అంతే విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ ఉన్న యువ భారతీయులను వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదన్నారు.
అయితే, హెచ్1బీ వీసాల ప్రక్రియలో ఎంపిక కాని దరఖాస్తులను వెనక్కి పంపించినట్లు యూఎస్‌సీఐఎస్(అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) విభాగం గతవారం వెల్లడించిన విషయం తెలిసిందే. భారతీయ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ వీసాలపైనే అమెరికా వెళ్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఎంపిక పక్రియను చేపట్టారు. లాటరీలో ఎంపిక కాని దరఖాస్తులను వెనక్కి పంపించినట్లు అధికారులు వెల్లడించారు.
——————————–