ప్రతిరోజూ మోరీలు శుభ్రం కావాలి, చెత్త ఎత్తాలి     

 జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు
నిజామాబాద్, జూన్ 19, (జనం సాక్షి):నగరంలోప్రతిరోజు మురుగు కాలువలు శుభ్రం చేయడంతో పాటు ఏరోజుకారోజు చెత్తను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి నగరంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. మిర్చి కాంపౌండ్, గాంధీ చౌక్, కుమార్ గల్లి, నెహ్రూ పార్క్, ఖిల్లారోడ్, సీతారాంనగర్ కాలనీ, గాజుల్ పేట్, న్యాల్ కల్  రోడ్డు, వినాయక్ నగర్ లో గల వినాయకుల బావి వరకు ఆయన రోడ్లను, మురుగు కాల్వలను పరిశీలించారు. మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో వర్షం కురిసిన చో రోడ్లపైన నీరు నిలిచే అవకాశమున్నందున నీరంతా ఒక వైపు వెళ్లేలా చూడాలని, ఇక్కడ మురుగు కాలువలు ప్రతిరోజూ శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు చెత్తను ఎత్తి డంపింగ్ యార్డును తరలించాలని ఆదేశించారు. ఆదేశించారు. బస్స్టాండ్, రైల్వేస్టేషన్, ఆసుపత్రులున్న ప్రాంతాల్లో కూడా ప్రతిరోజూ తరచుగా చెత్తను తొలగించాలన్నారు. గంజ్ వద్ద నీటి పైపులైను లీకేజీ రిపేరు చేసి నీరు వృథా పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖిల్లా రోడ్ లోని 26, 29 డివిజన్ల పరిధిలో గల డి 54 కెనాల్ లో చెత్త పేరుకుపోయి నందున క్రమం తప్పకుండా చెత్తను తీసి శుభ్రం చేయించాలన్నారు. 29 వ  డివిజన్ లో-ఓల్టేజీ వల్ల ఇళ్లలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని, కూలర్ల మోటార్లు కాలిపోతున్నాయని డిప్యూటీ మేయర్ కలెక్టర్ ను కలిసి వివరించగా వెంటనే ట్రాన్స్కో ఎస్.ఇ కి ఫోన్ చేసి పరిశీలించి వెంటనే సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఇంటింటికి చెత్త సేకరణను చేపట్టాలని సూచించారు. గాజుల్ పేట్ లోని ఖాళీ స్థలంలో వేసిన చెత్తను తొలగించాలన్నారు. వినాయకుల బావి వద్ద వ్యాపార సంస్థల నుండి పెద్ద ఎత్తున చెత్త వేసే అవకాశమున్నందున ఆ యాజమాన్యానికి చెత్త వేయకుండా ఆదేశాలు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ ను సూచించారు.