ప్రతి ఓటరు గుర్తింపుకు ఆధార్ లింక్ చేయాలి…

-కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య…

జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్3 (జనం సాక్షి):
ప్రతి ఓటరు గుర్తింపుకు తప్పనిసరి ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య తెలిపారు.
శుక్రవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం పై జిల్లా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… 18 సంవత్సరంలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు కల్పించాలని, అందుకు కళాశాలల్లో బ్రాడ్ అంబాసిడర్ గా సీనియర్ విద్యార్థులను ఎంపిక చేసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృత పరచాలన్నారు.జిల్లాలో 857 పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయని వాటికి బిఎల్ఓ వున్నారని అలాగే పంచాయతీ సెక్రటరీల సహకారంతో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు సంయుక్తంగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టాలన్నారు. గ్రామాలలో గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ లలో మున్సిపల్ కౌన్సిలర్లు బాధ్యత తీసుకొని ఓటర్ నమోదు పెంచాలన్నారు.
ఓటర్ నమోదు పత్రాలలో ఫారం 6 లో ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని ఫారం 6 బి లో ఆధార్ నెంబర్ అనుసంధానం చేయాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 1.35 లక్షల కుటుంబాలకు స్వయం సహకార సంఘాల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి బిఎల్ఓస్ ను పాల్గొనేలా చేయాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, సీసీ ల ద్వారా కూలీలకు కూడా సమాచారం చేరవేయాలి అన్నారు. అదేవిధంగా ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి పుట్టిన వారి, మరణించిన వారి వివరాలను నమోదు చేస్తూ వాస్తవ నివేదిక రూపొందించాలన్నారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టినందున ఓటర్ నమోదుకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని గ్రామాల్లో ఇంటింటికి సమాచారం చేరే విధంగా అధికారులు మహిళ శిశు సంకేమం, విద్యా శాఖ, వైద్య శాఖ, పంచాయతీ శాఖల సిబ్బందిని సమన్వయ పరచాలన్నారు.అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు ఓటరు నమోదు కార్యక్రమాన్ని , ఆధార్ లింకేజ్ ను పరిశీలించి సిబ్బందికి సలహాలు సూచనలు ఇస్తూ అవగాహన పరచాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డి ఆర్ డి ఓ పిడి రామ్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.