ప్రతి గ్రామ పంచాయితీని ఆదర్శ గ్రామ పంచాయితీగా తీర్చిదిద్దాలి
-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్.
మహబూబాబాద్ -జూలై28(జనంసాక్షి)
ప్రతి గ్రామ పంచాయితీని ఆదర్శ గ్రామ పంచాయితీగా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మహబూబాబాద్ మండలం లోని జంగిలిగొండ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంజాల సాయిలు తో కలిసి గ్రామంలో పర్యటించి పరిసరాల పరిశుభ్రతను పరిశిలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న అన్ని గ్రామపంచాయితీలు పారిశుధ్యపరంగా పరిశుభ్రం గా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గ్రామ పంచాయితీ ద్వారా అందించాల్సినటువంటి మౌలిక సదుపాయాలను చేరువ చేసేందుకు, గ్రామాలను ఆరోగ్య, ఆహ్లాదకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దుటకు ముందుగా పైలట్ ప్రాతిపదికన ప్రతి మండలం నుంచి 2 నుండి 3 గ్రామాలను ఎంపిక చేయడమైనదని, జిల్లాలో మొత్తం (41) గ్రామాలు పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టడమైనదని తెలిపారు. ప్రతి ఇంటికి ప్రతిరోజూ గ్రామ పంచాయితీ ట్రాక్టరును పంపించడం, ఇంటివద్దనే తడి, పొడి చెత్తలుగా వేరుచేసి సిబ్బంది ద్వారా ట్రాక్టరుకు అందించడం, అలాగే ట్రాక్టర్ వెళ్లలేని ప్రదేశాలకు, వీధులకు మూడు చక్రాల రిక్షాద్వారా చెత్త సేకరించడం జరుగుతుందని, ఇలా సేకరించిన తడి చెత్త నుండి సేంద్రియ ఎరువు తయారుచేయుట, అలాగే పొడిచెత్తను రీసైక్లింగ్ కోసం అమ్మివేయడం జరుగుతుందన్నారు. ఈ చెత్త సేకరణలో మఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వ్యర్దాల వల్ల జరిగే అనర్ధాలను ప్రజలకు వివరించడం, గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్దాలను బయటపడవేయకుండా వారంలో ఒక రోజు ప్రత్యేకంగా ప్లాస్టిక్ కలెక్షన్ డే గా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రతి మహిళకు అవగాహన కల్పించడం కోసం ప్రతి (20) నుండి (25) ఇళ్ళకు గ్రామ సమైక్య నుండి ఒక స్వచ్చ దూతను ఎంపిక చేయడం జరిగిందని, వీరికి తడి, పొడి చెత్తలను ఇంటివద్దనే వేరు చేసి ఇచ్చె విధంగా గ్రామ స్థాయి లో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. స్వచ్చ దూతలు వారికి కేటాయించిన (20) నుండి (30) ఇళ్ళనందు గృహిణులను ప్రతిరోజూ కలిసి అవగాహన కల్పించడం, వారికి చెత్తను వేరు చేసి ఇవ్వడం వలన జరిగే ప్రయోజనాలను తెలియ పడచడం జరుగుతుందని, ఈ విధంగా గ్రామములోని అన్ని ఇండ్లనుండి సేకరించిన తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువును తయారుచేసి, అట్టి ఎరువును గ్రామంలోని నర్సరినందు మొక్కలకు, కూరగాయల పెంపకంనకు వినియోగించుకోనుట, పొడి చెత్తను అమ్మి గ్రామ పంచాయితీకి అదాయము సమకూర్చుకొనడం జరుగుతుందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయుచూ అదర్శ గ్రామంగా ఉన్న మహబూబాబాద్ మండలం జంగిలిగొండ గ్రామాన్ని ఈ రోజు సందర్శించి గ్రామము నందు తడి, పొడి చెత్త వేరు చేయుచున్న విధానమును మహిళలను అడిగి తెలుగుసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గ్రామములోని దొంతు ఐలమ్మ ఇంటిని సందర్శించి ఇంటి పరిశుభ్రతను పరిశీలించి, తడి, పొడి చెత్తపై అడిగి తెలుసుకొన్నారు. స్వచ్చ దూతలను కుడా తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించడంపై కలుగు ప్రయోజనముల గురించి అడుగగా వారు వాటి ప్రాధాన్యతను వివరించడం జరిగింది. అనంతరం గ్రామంలోని వీధులను సందర్శించి పారిశుధ్యంను పరిశీలించారు. జిల్లానందు గల ఇతర గ్రామ పంచాయితీల నందు కూడా తడి, పొడి చెత్తలను వేరుచేసి పారిశుధ్య పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నలమాస కవిత, స్వచ్చదూత అదనపు కలెక్టర్ కు వివరిస్తూ తడి పొడి చెత్తల వేరు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం పై మాకు శిక్షణ ద్వారా అవగాహన కల్పించారని, తనకు కేటాయించిన (25) కుటుంబాల సభ్యులందరినీ ఈ విషయంపై రోజూ వారిని కలుస్తూ, ఇది ఒక సామాజిక బాధ్యతగా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. దొంతి ఐలమ్మ. గృహిణి మాట్లాడుతూ, మాకు స్వచ్చ దూతలు తడి, పొడి చెత్త వేరు చేయడం గురించి తెలియజేసి, అవగాహన కల్పించారని, ఈ అవగాహన వలన మేము ప్రతిరోజూ తడి, పొడి చెత్తలను వేరు చేసి గ్రామ పంచాయితీ ట్రాక్టర్ కు అందిస్తున్నామని తెలిపారు. పంజాల యకసాయిలు, సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామము ఆదర్శ గ్రామంగా గుర్తించబడుటకు గాను, వార్డు మెంబర్లు, ఐ.కె.పి మహిళలు, గ్రామ స్తాయి ఉద్యోగులు అందరితో కలిసి పారిశుధ్యంపై గ్రామ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్ ప్రాధమిక పాఠశాలను సందర్శించి పాఠశాలలో బోధిస్తున్న పాఠ్యాంశాలపై విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనంను పరిశిలించారు. అనంతరం జరుపులతండ బృహత్ పల్లె ప్రకృతి వనం, అలాగే తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు గుర్తించిన భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, ఎంపిడివో వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.