ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి మంచినీరు

4

– సిరిసిల్లలో సైలాన్‌ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

కరీంనగర్‌, అక్టోబర్‌2(జనంసాక్షి):

పల్లెపల్లెకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించి, ఇంటింటికీ నల్లాతో అందించాలన్న బృహత్తర లక్ష్యంతో వాటర్‌ గ్రిడ్‌ పథకం చేపట్టామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  చెప్పారు. రానున్న మూడేళకలలో దీనిని పూర్తిచేస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా కార్యక్రమం శరవేగంగా సాగుతోందన్నారు.  వాటర్‌ గ్రిడ్‌ పథకం సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని సంపూర్ణ మరుగుదొడ్లు గల నియోజకవర్గంగా చేసిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ.. ఇంటింటికి వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా మంచినీటిని అందిస్తామన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఇంటింటికి మంచినీటిని అందియ్యకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రకటించిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్‌ గర్వంగా చెబుతున్నామన్నారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం కోసం లక్షా 50 వేల కిలోవిూటర్ల పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఇన్‌టేక్‌ వెల్స్‌ నిర్మాణం కొనసాగుతోందని వెల్లడించారు. ప్రతి మండలంలో పైప్‌లైన్‌ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రైట ఆఫ్‌ వే, రైట్‌ ఆఫ్‌ యూస్‌ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం కోసం 2 వందల మెగావాట్ల కరెంట్‌ అవసరమని పేర్కొన్నారు. వాటర్‌ గ్రిడ్‌కు అడ్డంకులు సృష్టించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే మూడేళ్లలో ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల నష్టపరిహారం అందిస్తోన్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. వాళ్లు 60 ఏళ్లు పాలించి వదిలి వెళ్లిన కంపును తమ ప్రభుత్వం పదిహేను నెలల్లో తొలగించాలనడం ఎంత వరకు సబబన్నారు. వాళ్లు వదిలిన 60 ఏళ్ల దరిద్రాన్ని పదిహేనేళ్లలో తొలగించాలనే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రజలు చూసే ఉంటారని గుర్తు చేశారు. రైతు ఆత్మహత్యలు, సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తామని ఆశించామని కానీ వాళ్లు చేసిందేవిూ లేదని తెలిపారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి జానెడు సూచన చేయలేదన్నారు. చిన్నారెడ్డి చిన్న సలహా ఇవ్వలేదని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏవో నాలుగు ఉత్తమ మాటలు చెబుతాడనుకుంటే ఆయన కూడా ఏవిూ చెప్పకుండానే విమర్శలు చేశాడని తెలిపారు. నిన్న సభలో సీఎం అనుకుంటే ప్రతిపక్షాల బట్టలు ఊడదీసే వాడని వివరించారు. మర్యాద ఇస్తే పుచ్చుకోవాలి కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా విమర్శించడం సరికాదన్నారు.  ఇవాళ రైతులను దీన స్థితిలోవదిలి వెళ్లింది ప్రతిపక్షాలు కాదా? అని నిలదీశారు. సిద్దిపేట, సిరిసిల్ల స్ఫూర్తిగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని సంపూర్ణ స్వచ్ఛ నియోజకవర్గాలు తీర్చి దిద్దుకోవాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గం వంద శాతం మరుగుదొడ్లు ఉన్న నియోజకవర్గాలుగా ఉండాలని ఆకాంక్షించారు. ఇందు కోసం అందరూ సంపూర్ణంగా సహకరించాలని కోరారు. ఈ విషయంలో మా హరీష్‌ బావ మాతో పోటీ పడ్డారని ఛలోక్తి విసిరారు. సిరిసిల్లకంటే ముందే సిద్దిపేటను వంద శాతం మరుగుదొడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చి దిద్దాడని అన్నారు. దీంతో సభలో ఒక్కసారి నవ్వులు విరబూసాయి. డివిజన్‌లోని మూడు నియోజకవర్గాలు సిరిసిల్ల, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాలను వంద శాతం మరుగుదొడ్లు ఉన్న నగరంగా తీర్చి దిద్దాలన్నారు. మేం 15 రోజులు, నెలరోజుల్లో చేసిన పనిని విూరు నెలన్నర రోజుల్లో చేయలేరా? అని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా తమ నియోజకవర్గంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చినట్టు మంత్రి తెలిపారు. అందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉంటుందని హావిూ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.