ప్రతీకారం తీర్చుకుంటాం..

ముష్కరుల మూలాలను పెకిలించేదాకా దాడులు ఆపేది లేదు
అధికారికంగా యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం
హమాస్‌ మిలిటెంట్లలను వందలాది మందిని మట్టుబెట్టామని వెల్లడి
వేలాదిమంది పౌరులకు గాయాలు.. రెండోరోజూ భీకర దాడులు
సైన్యం, మిలిటెంట్ల మధ్య పోరులో వెయ్యి మందికిపైగా మృతి!
ఇజ్రాయిల్‌ దేశస్తులకు ప్రపంచదేశాల మద్దతు, సహాయక చర్యలు
టెల్‌అవీవ్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి):
తమ భూభాగంలోకి చొరబడి రక్తపుటేరులు పారించిన హమాస్‌ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్‌ కన్నెర్రజేసింది. హమాస్‌ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలోని ముష్కరుల స్థావరాలను శిథిలాల కుప్పగా చేస్తామని సైన్యం ప్రతిజ్ఞ చేసింది. ఇప్పటికే 400మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని, ఉగ్రమూలాలను పెకిలించేదాకా దాడులు ఆపబోమని స్పష్టం చేసింది. ఆదివారం రెండోరోజు పోరుతో దాదాపు వెయ్యిమందికిపైగా మృతిచెందినట్టు తెలిసింది. వేలాదిమంది గాయపడ్డారు. మిలిటెంట్ల దాడులతో ఇజ్రాయెల్‌ దద్దరిల్లగా.. ప్రతిగా పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ కూడా వైమానిక దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ సైన్యం అధికారికంగా యుద్ధంలో ఉన్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయానికి సెక్యూరిటీ కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపిందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వెల్లడిరచారు.
మరోవైపు హమాస్‌ ఉగ్రవాదుల కోసం పలు పట్టణాల్లో వేట కొనసాగుతోందని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డానియేట్‌ హగారి వెల్లడిరచారు. కిఫర్‌ అజాలో దళాలు ఇప్పటిదాకా పోరాడుతున్నాయని, వేర్వేరు నగరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని నగరాల్లో ఐడీఎఫ్‌ బలగాలు మోహరించాయని, ఐడీఎఫ్‌ లేని ఊరే లేదని అన్నారు. దళాలు తొలుత గాజా సరిహద్దు వెంబడి నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నాయి. అక్కడ దాడులను తగ్గించి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అలాగే ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు హమాస్‌ ఉగ్రవాద సంస్థ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నివాసం సమీపంలోని సైనిక కేంద్రాలను ఢీకొట్టాయని ఐడీఎఫ్‌ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌ దేశానికి, ఆ దేశ పౌరులకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తగిన సహాయసహకారాలు అన్నివిధాలా కొన్ని దేశాలు ముందుకొస్తున్నాయి.
ఉగ్రవాదుల అరాచకాలు
ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ ఉగ్రవాదులు అక్కడ అరాచకాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే వందలాది మందిని హతమార్చిన మిలిటెంట్లు.. మహిళల పట్ల కూడా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇజ్రాయెల్‌ మహిళలను బంధించి వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్‌ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అపహరించిన వారిని ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లోని గాజాకు తరలించినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ జొనాథన్‌ కార్నికస్‌ తెలిపారు. వారిలో ఇప్పటికే చాలా మందిని చిత్రహింసలు చేసి చంపేసి ఉంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.